స్క్రిప్ట్‌ రావడం లేదా? సినిమాలే రావడం లేదా?

Update: 2022-07-13 03:30 GMT
టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమా ల్లో నటించే అవకాశాలు దక్కించుకున్న ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్. టాలీవుడ్‌ లో యంగ్‌ స్టార్‌ హీరోలు అందరితో కూడా కలిసి నటించిన ఘనత ఈ అమ్మడికి దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అనూహ్యంగా ఈ అమ్మడి కెరీర్ త్వరగా ముగిసింది.

మహేష్ బాబు వంటి సూపర్‌ స్టార్‌ కే ఒకానొక సమయంలో డేట్లు లేక తిరష్కరించిన ఈ అమ్మడు ఆ తర్వాత కొన్నాళ్లకే అసలు ఆఫర్లు లేకుండా పోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో అరడజను సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యింది. హీరోయిన్ గా ఈ అమ్మడు బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా మారింది.

బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ లో కూడా నటించాలి అనేది ఈమె కోరిక కాని ఈమెకు సౌత్‌ నుండి పెద్దగా ఆఫర్లు వస్తున్నట్లుగా అనిపించడం లేదు. తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అభిమానులతో చేసిన చిట్‌ చాట్‌ సందర్బంగా తెలుగు సినిమా ల గురించి స్పందించింది. తాను తెలుగు సినిమాలను చేయక పోవడంకు కారణం ఏంటీ అనే విషయంను రకుల్‌ చిట్‌ చాట్‌ లో వెళ్లడించింది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ను లైవ్‌ చాట్‌ సందర్బంగా ఒక అభిమాని మీరు తెలుగు లో ఎందుకు సినిమా లు చేయడం లేదు.. ఇక పై మీరు హిందీ లోనే సినిమాలు చేస్తారా అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు రకుల్‌ స్పందిస్తూ నేను తెలుగు లో చేయకూడదని ఏమీ అనుకోవడం లేదు. తప్పకుండా మంచి స్క్రిప్ట్‌ వస్తే చేసేందుకు సిద్దంగా ఉన్నాను.

ఛాలెంజింగ్‌ రోల్స్.. విభిన్నమైన స్క్రిప్ట్‌ ల కోసం వెయిట్‌ చేస్తున్నాను. హిందీలో బిజీగా ఉన్నప్పటికి మంచి స్క్రిప్ట్‌ వస్తే తప్పకుండా భాష తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తాను అన్నట్లుగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చెప్పుకొచ్చింది. తెలుగు నుండి స్క్రిప్ట్‌ సరైనవి రావడం లేదని రకుల్‌ ప్రీత్‌ అంటుంది కానీ.. అసలు ఆమెకు ఆఫర్లు రావడం లేదు అనేది కొందరి వాదన.

మొత్తానికి సౌత్‌ లో కమిట్‌ అయిన ఇండియన్‌ 2 ఒక్కటి కూడా ఏవో కారణాల వల్ల ఆగి పోయింది. మళ్లీ ఆ సినిమా మొదలు అయ్యేది ఎప్పుడో క్లారిటీ లేదు. తెలుగు లో మళ్లీ ఆఫర్లు వస్తాయా అనేది నమ్మకం లేదు. కాని బాలీవుడ్ లో ఈ అమ్మడు ప్రస్తుతం చేస్తున్న సినిమా లు సక్సెస్‌ అయ్యి అక్కడ స్టార్‌ గా మంచి పేరు దక్కించుకుంటే ఖచ్చితంగా మళ్లీ సౌత్‌ లో కూడా సందడి చేసే అవకాశాలు లేకపోలేదు అనేది విశ్లేషకుల అభిప్రాయం.
Tags:    

Similar News