కాల్ మనీ పై సినిమాకి వర్మ రెడీ

Update: 2015-12-16 15:30 GMT
బెజవాడలో కాల్ మనీ వ్యవహారం సృష్టిస్తున్న సంచలనం చూస్తూనే ఉన్నాం. చదువు లేకుండా కోటీశ్వరులు కావడం, నాయకులు-పోలీసులు-ఉన్నతాధికారులు కూడా ఇందులో భాగం కావడం, వడ్డీలకు డబ్బులిచ్చి బలవంతంగా వ్యభిచారంలోకి లాగడం లాంటి సంఘటనలు బయటకు వచ్చి, ఏపీ అంతా అట్టుడికిపోతోంది. వడ్డీ వ్యాపారుల ఇళ్లపైకి పోలీసులు దండెత్తుతున్న తీరు చూస్తే.. ఈ వ్యవహారం ఇప్పట్లో తేలదేమో అనిపిస్తుంది. ఇంతగా సమాజాన్ని కదిపేసిన ఈ సంఘటనలో.. రామ్ గోపాల్ వర్మకి సినిమా స్టోరీ కనిపిస్తోంది.

డబ్బు - అధికారం - బెదిరింపులు - రౌడీయిజం - అమ్మాయిలు - అమ్మేయడం - తార్చడం వంటి వ్యవహారాలన్నీ.. మంచి మసాలా స్టోరీ అయ్యే ఛాన్స్ అవడంతో.. ఇప్పుడీ విషయంపై దృష్టి పెట్టాడు వర్మ. అందులోనూ ఓ మంత్రిగారికి ఇందులో భాగం ఉందన్న వార్తలు.. ఈ స్టోరీకి మరింత రంజుగా తయారు చేశాయి. అందుకే వీలైనంత త్వరగా ఈ కథ రెడీ చేసేయబోతున్నాడట. అందులోనూ బెజవాడ అంటే సహజంగానే రామ్ గోపాల్ వర్మ బాగా యాక్టివ్ గా ఉంటాడు. గతంలో ఓ సినిమాకి బెజవాడ రౌడీలు అని టైటిల్ పెట్టి, చివరకు బెజవాడతో సెట్ అయ్యాడు. అయినా వర్మకు సెక్స్ రాకెట్ లో సినిమా స్టోరీ కనిపించడం పెద్ద విషయమేం కాదు.

తాజ్ హోటల్ పై జరిగిన ఉగ్రవాద దాడినే సినిమాగా మార్చేసిన వర్మకు.. కాల్ మనీ సెక్స్ రాకెట్ నుంచి కథ అల్లడం పెద్ద కష్టం కూడా కాదు. అందులోనూ ఇందులో సంపాదించిన డబ్బుతో సినిమా తీసే ట్రయల్ కూడా ఒకటి జరిగింది కాబట్టి.. ఈ కాల్ మనీ స్టోరీకి సినిమాగా మారే అన్ని అర్హతలు ఉన్నట్లే. త్వరగా తీసేసి రిలీజ్ చేసేస్తే.. వేడికి వేడి కలెక్షన్ కి కలెక్షన్ కుమ్మేయచ్చు. బహుశా వర్మ అయిడియా అదేనేమో కదా !

Tags:    

Similar News