పవర్ స్టార్ సినిమాలో ఆయన భక్తుడి పాత్ర కూడా ఉండబోతోందా...?

Update: 2020-07-12 09:50 GMT
సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - నిర్మాత నటుడు బండ్ల గణేష్ కి మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేను పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ ని కాదు భక్తుడిని అంటారు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ కి కూడా గణేష్ అంటే సదాభిప్రాయమే ఉంది. ఈ క్రమంలోనే 'తీన్ మార్' సినిమాని బండ్ల గణేష్ కి ఇచ్చాడు పవన్. ఈ సినిమా పరాజయం పాలైనా పిలిచిమరీ 'గబ్బర్ సింగ్' సినిమాకి ప్రొడ్యూసర్ గా బండ్ల గణేష్ ని వ్యవహరించమని చెప్పాడు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమై రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బండ్ల గణేష్ ఆయన పార్టీలో కాకుండా వేరే పార్టీలో జాయిన్ అవడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. దీనికి తోడు ఈ మధ్య ఇద్దరూ పెద్దగా కలిసిన సందర్భాలు కూడా లేవు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వీరిద్దరిని కలపబోతున్నాడట. తాను తెరకెక్కిస్తున్న 'పవర్ స్టార్' సినిమాలో బండ్ల గణేష్ క్యారక్టర్ కూడా ఉండబోతోందని ఇండస్ట్రీ జనాల్లో టాక్ వినిపిస్తోంది.

వర్మ 'పవర్ స్టార్' సినిమా అనౌన్స్ చేసినప్పుడు PS MS NB TS అనే పాత్రలతో పాటు ఓ రష్యన్ యువతి నలుగురు పిల్లలు 8 గేదెలు మరియు ఆర్జీవీ ఉండబోతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లను పోలిన పాత్రధారులను పరిచయం చేసి.. ఈ పాత్రలు నిజ జీవితంలో ఎవరినైనా పోలి ఉంటే అది యాదృచ్ఛికం మాత్రమే అని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు బండ్ల గణేష్ ని పోలిన వ్యక్తిని కూడా వర్మ 'పవర్ స్టార్' సినిమాలో పెట్టారట. త్వరలోనే అతని లుక్ కూడా రిలీజ్ చేసే అవకాశాలున్నాయట. అయితే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా ఎన్నికల తర్వాత జరిగిన కథ అని చెప్పుకొచ్చారు. కానీ బండ్ల గణేష్ ని పోలిన పాత్రధారిని 'పవర్ స్టార్' లో ఎలా ఇన్వాల్వ్ చేస్తారో అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తాను రిలీజ్ చేసిన స్టిల్స్ తో సంచలనం రేపిన వర్మ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి వివాదాలు లేవనెత్తుతారో చూడాలి.
Tags:    

Similar News