రాజమౌళిలా ఎవ్వరూ ఉండరంటున్న లెజెండ్

Update: 2017-04-06 10:17 GMT
సాబు సిరిల్.. దేశం గర్వించదగ్గ ఆర్ట్ డైరెక్టర్. ‘బాహుబలి’ చేయడానికంటే ముందు ఆయన ఎన్నో భారీ చిత్రాలకు ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేశారు. జాతీయ అవార్డులు సహా ఎన్నో పురస్కారాలు పొందారు. ‘బాహుబలి’ కోసం రాజమౌళి ఆయన్ని సంప్రదించే సమయానికి ఆయన రేంజే వేరు. ఆయన ముందు రాజమౌళి చిన్నవాడు. కానీ ఈ సినిమా చేశాక రాజమౌళి ఎంత గొప్ప దర్శకుడో తనకు తెలిసిందంటున్నాడు సాబు. ఎంతో అనుభవమున్న తాను కూడా రాజమౌళి నుంచి ఎంతో నేర్చుకున్నానని.. కొన్ని వందలు.. వేలమంది ఐదేళ్ల పాటు ‘బాహుబలి’ కోసం పని చేశారంటే.. అది కేవలం రాజమౌళి వల్లే అని అంటున్నాడు సాబు. ఎన్నో భారీ చిత్రాలకు పని చేసిన తనకు రాజమౌళి కఠిన సవాల్ విసిరాడని.. ‘బాహుబలి’ లాంటి సినిమాకు పని చేసినందుకు గర్విస్తున్నానని కూడా సాబు అన్నాడు.

‘‘రాజమౌళి నాకు కథ చెప్పినపుడు వెయ్యి అడుగుల నుంచి పడే జలపాతానికి సంబంధించిన స్కెచ్ చూపించాడు. రాజమౌళి ఊహిస్తున్న బాహుబలి ప్రపంచం ఎంత భారీగా ఉండబోతుందో నాకు అప్పుడే అర్థమైంది. నా ముందు పెద్ద సవాలు ఉందని నాకు అప్పుడే అర్థమైంది. తొలి రోజు నుంచి ‘బాహుబలి’ నాకు అలాంటి సవాళ్లు ఎన్నో విసిరింది. నా కెరీర్లో సినిమానే ప్రపంచంగా బతికే చాలామందిని కలిశాను. కానీ వాళ్లందరిలోనూ రాజమౌళి ప్రత్యేకం. అతడి స్థాయే వేరు. అంతగా కష్టపడే దర్శకుడిని నేను చూడలేదు. తనతో కలిసి పని చేస్తుంటే.. ఇక సినిమా తప్ప మరేదీ ఆలోచించలేం. రాజమౌళిలా ఉండటం చాలా కష్టం. రాజమౌళి వల్లే బాహుబలి టీంని అందరూ అంతగా కష్టపడ్డారు. ‘బాహుబలి’కి పని చేసినన్నాళ్లూ మేం ప్రతి రోజూ ఉదయం 3.30కి లేచేవాళ్లం. 4.30కు బయల్దేరి 5.30-6 గంటల మధ్య సెట్ కు చేరుకునేవాళ్లం. రాజమౌళి 6.15కు వచ్చేసేవాడు. ఎప్పుడూ ఆలస్యమయ్యేది కాదు. ఈ షెడ్యూల్ నెలా రెండు నెలలు మెయింటైన్ చేయొచ్చు. కానీ ఐదేళ్ల పాటు ఇదే షెడ్యూల్ కొనసాగించడం అంటే మామూలు విషయం కాదు. ఇందుకు చాలా క్రమశిక్షణ కావాలి. అదంతా రాజమౌళి వల్లే సాధ్యమైంది’’ అని సాబు జక్కన్నకు కితాబిచ్చాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News