చెన్నై బ్యూటీ సమంత కొంతకాలంగా కనిపించడం లేదు. అభిమానులకు దూరంగా ఉండిపోయింది. కనీసం మాట కూడా వినిపించలేదు. శామ్స్ నోటి వెంట మాట కోసం, చేతి నుంచి రాత కోసం చాలా మంది ఎదురుచూసినా.. అసలు అడ్రస్ దొరక్కుండా గల్లంతైపోయింది. అఫ్ కోర్స్.. ఇదంతా ట్టిట్టర్ కే పరిమితం లెండి. ఈ సౌత్ సుందరి ట్విట్టర్ లో దర్శనమిచ్చి చాలా కాలం అయింది.
చివరగా డిసెంబర్ 25న సమంత ఓ ట్వీట్ చేసింది. అది కూడా మాజీ లవర్ సిద్ధార్ద్ చేసిన ట్వీట్ కు కౌంటర్. అయితే తను చేసిన ట్వీట్ ను తర్వాత తొలగించేసిన శామ్స్... తర్వాత అసలు ట్విట్టర్ కి రాలేదు. కనీసం న్యూ ఇయర్ విషెస్ కూడా చెప్పలేదంటే.. ఎంత దూరమైందో అర్ధం చేసుకోవచ్చు. మధ్యలో ఓసారి సమంత అకౌంట్ ని అధికారికం అని ట్విట్టర్ ధృవీకరించింది. ఇందుకు నిదర్శనంగా సమంత అకౌంట్ పక్కన ఓ బ్లూ టిక్ ని కూడా ఏర్పాటు చేసింది. అప్పుడైనా సమంత ట్వీట్ పెడుతుందని ఫ్యాన్స్ ఆశించినా.. ఆ ఆశ కూడా గల్లంతైపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు శామ్స్ ట్విట్టర్ లోకి వచ్చింది.
'నేను మీతో ఉన్నపుడు ఓ సైన్యంతో ఉన్నట్లుగా అనిపిస్తుంది. థాంక్యూ, ఐయామ్ బ్యాక్ ' అంటూ ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది సమంత. మళ్లీ వచ్చానని చెప్పింది కానీ.. ఇన్నాళ్లూ ఎందుకు దూరంగా ఉందో మాత్రం చెప్పలేదు. పోన్లే.. అసలు మా సమంత వచ్చేసింది అనుకుంటూ ఫ్యాన్స్ సంతోషించేస్తున్నారు.