సర్దార్ గబ్బర్ సింగ్.. విడుదలకు సిద్ధం

Update: 2016-07-13 08:10 GMT
ఏప్రిల్ 8న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘సర్దార్ గబ్బర్ సింగ్’. కానీ అంచనాల్ని అందుకోవడంలో విఫలమై.. బాక్సాఫీస్ దగ్గర చతికిలబడింది. తొలి రోజు రూ.30 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించినా.. ఆ తర్వాత సినిమా నిలబడలేకపోయింది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన సరిగ్గా వంద రోజులకు బుల్లెతరపై ప్రసారం కాబోతుండటం విశేషం. ఈ నెల 17న.. ఆదివారం మా టీవీలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫస్ట్ ప్రిమియర్ షో ప్రసారం కానుంది.

‘సర్దార్ గబ్బర్ సింగ్’ మీద పెట్టిన పెట్టుబడి.. వసూళ్లను బేరీజు వేసుకుని చూస్తే డిజాస్టరే కానీ.. సినిమా మరీ తీసిపారేయదగ్గదేమీ కాదు. అంచనాలు మరీ పెరిగిపోవడం.. వాటిని అందుకోవడంలో ఈ సినిమా విఫలమవడంతో సినిమాకు అలాంటి ఫలితం వచ్చింది. ప్రథమార్ధం వరకు బాగానే ఉంటుంది. ద్వితీయార్ధం విషయంలోనే తేడా కొట్టేయడంతోనే సినిమా అలా తయారైంది. ఐతే టీవీల్లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు మంచి ఆదరణే ఉంటుందని భావిస్తున్నారు. ఈ సినిమాకు మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చే అవకాశాలున్నాయి. మా టీవీ దాదాపు రూ.13 కోట్లు పెట్టి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ శాటిలైట్ హక్కులు విడుదలకు ముందే కొనుక్కుంది. ఇది నాన్-బాహుబలి రికార్డు. మరి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ టెలికాస్ట్ ద్వారా ఆ మొత్తాన్ని రాబట్టుకుంటుందో లేదో.. ఫస్ట్ ప్రిమియర్ షోతోనే తేలిపోతుంది.
Tags:    

Similar News