అందుకే హీరో అవలేదన్న స్టార్ ప్రొడ్యూసర్!

Update: 2022-01-04 14:30 GMT
ఏ సినిమాకైనా రథసారథి నిర్మాతనే. ఒక సినిమా మొదటి నుంచి చివరి వరకూ దానిని అంటిపెట్టుకుని ఉండేది .. ఆ సినిమా ఫలితం ఏదైనా దానిని అందుకునేది నిర్మాతనే. అయితే నిర్మాతలనేవారు కేవలం డబ్బు పెట్టేవారిగానే కాకుండా, తమ సినిమాల నిర్మాణంలో ఎలాంటి పాత్రను పోషించాలనేది తెలియజెప్పిన నిర్మాతగా రామానాయుడు కనిపిస్తారు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే నిర్మాతలెందరికో ఆయన అనుభవాలే పాఠాలు అని చెప్పుకోవచ్చు. అలాంటి రామానాయుడి వారసుడిగా ఇప్పుడు సురేశ్ బాబు తెలుగు సినిమా నిర్మాణంలో తనదైన ప్రభావం చూపుతున్నారు.

రామానాయుడు ఫ్యామిలీ నుంచి వెంకటేశ్ హీరోగా ఇండస్ట్రీకి వచ్చారు. అయితే సురేశ్ బాబు ఎందుకు హీరో కావాలని అనుకోలేదు? అనే ప్రశ్న చాలామందిలో తలెత్తే ఉంటుంది. ఒక స్టార్ ప్రొడ్యూసర్ తనయుడిగా అన్ని రకాల అవకాశాలు అందుబాటులో ఉండి కూడా ఆయన హీరో కావాలని ఎందుకు అనుకోలేదు? కనీసం సరదా కోసమైనా తెరపై కనిపించాలని ఎందుకు ఉత్సాహాన్ని చూపలేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. తాజా ఇంటర్వ్యూలో సురేశ్ బాబుకి ఇదే ప్రశ్న ఎదురైనప్పుడు ఆయన అందుకు సమాధానమిచ్చారు.

"నిజంగానే నేను హీరో కావాలని అనుకుంటే అన్నిరకాల అవకాశాలు ఉన్నాయి. కానీ నేను ఎప్పుడూ కూడా హీరోగా కనిపించాలని కోరుకోలేదు. అసలు ఆ వైపే ఆలోచన చేయలేదు. మొదటి నుంచి కూడా నేను ఏం చేయాలి? ఏ రూట్లో వెళ్లడం వలన నేను సక్సెస్ అవుతాను? అనే విషయంలో నాకంటూ ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఉండేది. అందువలన నాకు ఆసక్తి ఉన్న నిర్మాణ రంగంలోనే ఉండాలని నేను అనుకున్నాను. హీరోగా బాగుంటావు అంటూ నన్ను చాలామంది ప్రోత్సహించారు .. ఆ రూట్లో ముందుకు వెళ్లమని సలహాలు .. సూచనలు ఇచ్చారు.

కానీ ఆ మాటలేవీ నా అభిప్రాయాన్ని .. నిర్ణయాన్ని మార్చలేకపోయాయి. నేను ఏం చేస్తే బాగుంటుంది అనే విషయంలో నాకు గల క్లారిటీనే అందుకు కారణం. నేను సక్సెస్ కావడానికి ప్రధానమైన కారణం కూడా అదేనని నేను నమ్ముతాను. అలాగే నన్ను నమ్మి వచ్చిన భార్యకు అన్యాయం చేయకూడదని అనుకున్నాను. మా బంధువులలో ఒకరిని చూసి వ్యసనాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అలా నేను తీసుకున్న కొన్ని బలమైన నిర్ణయాలే నన్ను ఈ రోజున ఈ స్థానంలో నిలబెట్టాయని భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News