'రాధేశ్యామ్' గురించి ఆర్జీవీ అంతమాట అనేశాడే!

Update: 2022-03-18 11:32 GMT
ప్రభాస్ - పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ 'రాధేశ్యామ్' సినిమాను రూపొందించాడు. వంశీ .. ప్రమోద్ .. ప్రసీద నిర్మించిన ఈ సినిమా, భారీ అంచనాల మధ్య ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను సమకూర్చాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 3 రోజుల్లోనే 151 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఆ తరువాత నుంచి వసూళ్ల గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా హిందీ వెర్షన్ విషయంలో అంచనాలు పూర్తిగా తప్పాయి.

'బాహుబలి' .. 'బాహుబలి 2' సినిమాలు హిందీలో భారీ వసూళ్లను సాధించాయి. ఇక 'సాహో' విషయంలో హిట్ టాక్ రాకపోయినప్పటికీ, వసూళ్లు మాత్రం గట్టిగానే వచ్చాయి. కానీ 'రాధే శ్యామ్' విషయంలో ఆ మేజిక్ పనిచేయలేదు. ఈ సినిమా కూడా లాంగ్ రన్ లో హిందీలో 100 కోట్లను వసూలు చేస్తుందని భావించారు. కానీ ఆ మార్కుకి చాలా దూరంలోనే ఈ సినిమా ఆగిపోయేలా కనిపిస్తోందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి వర్మ తనదైన స్టైల్లో తన అభిప్రాయం చెప్పాడు.

ఒక హీరో అంతకుముందు సినిమా సక్సెస్ అయిన స్థాయిని బట్టి .. ఆ సినిమా వసూళ్లను బట్టి ఆ తరువాత సినిమా తీయకూడదు. అంతకు ముందు సినిమాను బట్టే ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఉండటం సహజం.

ఆ అంచనాలను ఖర్చుతో కాకుండా కథతో అందుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే మన చేతిలో ఉన్న ప్రాజెక్టుకు న్యాయం చేసినట్టు అవుతుంది. ఇంతకుముందు సినిమాకి అంత ఖర్చు పెట్టారు గదా? ఈ సినిమాకి ఇంతే ఎందుకు ఖర్చు చేశారు? అని ఎవరూ అడగరు. ఎందుకంటే ఆడియన్స్ కి కావలసింది ఖర్చు కాదు కథనే.

'రాధే శ్యామ్' సినిమాను విజువల్ బ్యూటీగానే చూపించారు. నిజానికి ఒక ప్రేమకథకు అద్భుతమైన విజువల్స్ అవసరం లేదు. ఒక్కోసారి అవి సహజత్వాన్ని దెబ్బతీస్తాయి. ఒక ప్రేమకథను తెరపై చూపించడానికి ఆ స్థాయి విజువల్స్ అవసరం లేదు కూడా. అలాంటి విజువల్స్ ఆ సన్నివేశాల్లోని సహజత్వాన్ని డామినేట్ చేస్తాయి.

ఖర్చు అనేది ఎప్పుడూ కథను బట్టి ఉండాలి తప్ప, ఖర్చు చేయడమే ప్రధానమైన ఉద్దేశంగా ఉండకూడదు. ఖర్చు కంటే కథలో దమ్ము ఉన్నప్పుడే ఏ సినిమా అయినా ఆడుతుంది. అందుకు 'ది కశ్మీర్ ఫైల్స్' ఒక ఉదాహరణ. కేవలం నాలుగైదు కోట్ల ఖర్చుతో తెరకెక్కించిన ఈ సినిమా, ఈ రోజున 100 కోట్ల వరకూ వస్తూ చేసింది" అని అన్నారు.
Tags:    

Similar News