'నాని నన్ను నాలుగైదు సార్లు ఏడిపించాడు'

Update: 2021-06-24 04:30 GMT
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ ''జెర్సీ'' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ షాహిద్ క‌పూర్ హీరోగా నటిస్తున్నాడు. తెలుగు 'జెర్సీ' ని డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నాడు. తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడిన షాహిద్.. ఈ సినిమాకి సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు.

"కబీర్ సింగ్ చేయక ముందే నేను 'జెర్సీ' సినిమా చూశాను. ఆ సమయంలో నేను సంతోషంగా లేను. నా కెరీర్ ఎక్కడికి వెళుతుందో.. నెక్స్ట్ ఏమి చేయాలో అనే ఆలోచనలో ఉన్నాను. అందుకే లేట్ సక్సెస్ గురించి చెప్పే జెర్సీ కథతో రిలేట్ అయ్యాను. ఇది రిటైర్ అయిన తర్వాత కీర్తిని పొందే ఓ వ్యక్తి కథ" అని షాహిద్ అన్నారు. ఈ సందర్భంగా హీరో నాని పై ప్రశంసలు కురిపించాడు. నాని ఆ పాత్రలో చాలా బాగా నటించాడని చెబుతూ.. సినిమా చూస్తున్నప్పుడు 4-5 సార్లు తనని ఏడిపించాడని షాహిద్ చెప్పుకొచ్చాడు.

"IMDb - Google ద్వారా నా వయస్సు అందరికీ తెలుసు. నా వయసు ఇప్పుడు 40. ఇప్పుడు మంచి కథలు చెప్పాలనుకుంటున్నాను. కథ నచ్చితే సినిమా చేస్తాను. నేను నా కెరీర్‌ లో కథలు లేకుండా చాలా సినిమాలు చేశాను. అందువల్ల మంచి కథ యొక్క ప్రాముఖ్యతను నేను చాలా ఆలస్యంగా గ్రహించాను. కాబట్టి, ఇప్పుడు మంచి కథలతో సినిమాలు చేయాలనుకుంటున్నాను. 'జెర్సీ' ఒక కుటుంబ చిత్రం. ఇది నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా" అని షాహిద్ కపూర్ తెలిపారు. 'జెర్సీ' చిత్రాన్ని విడుదల చేయడానికి దీపావళి గొప్ప సమయమని.. అప్పటికి థియేటర్లు తిరిగి ప్రారంభమవుతాయని ఆశిస్తున్నాను.. కుదరకపోతే విడుదల గురించి అప్డేట్ ఇస్తామని షాహీద్ కపూర్ చెప్పారు.

కాగా, 'జెర్సీ' చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. షాహిద్ కపూర్ తండ్రి పంకజ్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సాచెట్ పరంపర - తానిష్ బాగ్చి సంగీతం సమకూరుస్తున్నారు. జాన్ స్టీవర్ట్ ఎడూరి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారు. అనిల్ మెహతా సినిమాటోగ్రఫీ అందించగా.. రితేష్ సోని ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేయేషన్స్ - సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. బాలీవుడ్ నిర్మాత అమన్ గిల్ తో కలిసి అల్లు అరవింద్ - దిల్‌ రాజు - సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News