ట్రెండీ టాక్‌: ద‌ళ‌ప‌తి మూవీలో ఖాన్ విల‌నీ

Update: 2019-07-03 08:35 GMT
15 నిమిషాల విల‌నీ.. ద‌ళ‌ప‌తితో షారూక్ ఫైట్ సీన్! .. ఈ ప్ర‌చారం చూస్తుంటే.. కింగ్ ఖాన్ ఫ్యాన్స్ లో ఒక‌టే క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంది. బాలీవుడ్ బాద్ షా సౌత్ సినిమాలో విల‌న్ గా క‌నిపించ‌డ‌మా? అంటూ మాట్లాడుకుంటున్నారంతా. గ‌త కొంత‌కాలంగా కింగ్ ఖాన్ షారూక్ వ‌రుస ఫ్లాపుల వ‌ల్ల క్రేజును కోల్పోయార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఓవైపు ఆస్తి వివాదాలు- కోర్టులు అంటూ ఖాన్ కి చెందిన‌ రెడ్ చిల్లీస్ ఇబ్బందుల్లో ఉండ‌గానే కెరీర్ ప‌రంగా ర‌క‌రకాల వార్త‌లు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా 2018-19 సీజ‌న్ షారూక్ కి పీడ‌క‌ల‌లాంటిది అని చెప్పాలి. జీరో ఫ్లాప్ త‌ర్వాత అత‌డిపై రూమ‌ర్లు మ‌రీ ఎక్కువైపోయాయి.

అయితే వీట‌న్నిటి న‌డుమ అత‌డు ఒక సౌత్ స్టార్ సినిమాలో విల‌న్ గా న‌టిస్తున్నాడ‌న్న ప్ర‌చారం అంతే వైర‌ల్ అవుతోంది. ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్న తాజా చిత్రం బిగిల్ లో షారూక్ ఓ అతిధి పాత్ర‌లో న‌టిస్తున్నార‌ని గ‌త కొంత‌కాలంగా తామ‌ర తంప‌ర‌గా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే షారూక్ అతిధి పాత్ర‌లో కాదు ఏకంగా విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నార‌నేది తాజా ముచ్చ‌ట‌. షారూక్ 15 నిమిషాల పాటు బిగిల్ చిత్రంలో క‌నిపిస్తారు. విజ‌య్ తో ఓ ఫైట్ సీన్ కూడా ఉంటుంది. క‌థ‌ని కీల‌క మ‌లుపు తిప్పే విల‌న్ పాత్ర ఇద‌ని కోలీవుడ్ - బాలీవుడ్ మీడియాల్లో ప్ర‌చార‌మ‌వుతోంది.

జీరో ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలోనే ఇది ఖ‌రారైంద‌ని.. అప్ప‌ట్లో ఓ ఐపీఎల్ మ్యాచ్ జ‌రుగుతున్న‌ప్పుడు.. ద‌ర్శ‌కుడు అట్లీ నేరుగా షారూక్ ని క‌లుసుకుని ఒప్పించార‌ని మాట్లాడుకున్నారు. తొలుత‌ షారూక్ హీరోగా `మెర్స‌ల్` హిందీ రీమేక్ ప్లాన్ చేస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది. అయితే అట్లీ షారూక్ తో ముచ్చ‌టించిన విష‌యం వేర‌ని భావిస్తున్నారు. విజ‌య్ బిగిల్ చిత్రంలో విల‌న్ పాత్ర‌ను షారూక్ కి ఆఫ‌ర్ చేశాడ‌ని చెబుతున్నారు.  జీరో త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కూ షారూక్ వేరొక సినిమాకి సంత‌కం చేయ‌లేదు. మ‌రి ఈ ఆఫ‌ర్ ని అత‌డు అంగీక‌రించి ఉంటారా? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇది ఇప్ప‌టికి కేవ‌లం గాసిప్ మాత్ర‌మే. అధికారికంగా బిగిల్ యూనిట్ ధృవీక‌రించాల్సి ఉంది.

    

Tags:    

Similar News