ఆలోచనలోపడిన శర్వానంద్ .. ఆశలన్నీ ఆ సినిమాపైనే!

Update: 2021-10-17 05:31 GMT
శర్వానంద్ కి యూత్ లోను .. ఫ్యామిలీ ఆడియన్స్ లోను మంచి క్రేజ్ ఉంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన సన్నివేశాల్లో చాలా సహజంగా చేస్తాడు. కెమెరా ముందు కాకుండా మన ముందు ఉన్నట్టుగా అనిపించేలా ఆయన నటన ఉంటుంది. కథల ఎంపిక విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. తనకి నచ్చితే మాత్రమే చేస్తాడు .. లేదంటే లేదు. ఈ ఏడాది ఇన్ని సినిమాలు చేసేయాలి అనే ఒక టార్గెట్ పెట్టుకుని, ఆ దిశగా హడావిడి పడిపోవడం ఆయన కెరియర్ ఆరంభం నుంచి కూడా కనిపించదు.

నిదానంగా .. తాపీగా తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలకు మాత్రమే ఓకే చెబుతూ వెళుతుంటాడు. అయితే కథల విషయంలో నాని తరువాత ఆ స్థాయి శ్రద్ధ తీసుకుంటాడనే  పేరున్న శర్వానంద్, కొంతకాలంగా వరుస పరాజయాలు ఎదుర్కుంటూ వస్తున్నాడు. కొత్తదనం కోసం ఆయన తనవంతు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కలిసి రావడం లేదు. నిజం చెప్పాలంటే హిట్ అనే మాట విని ఆయన చాలాకాలమే అయింది. 'మహానుభావుడు' తరువాత ఆయన జోరు కంటిన్యూ అవుతుందని అనుకుంటే, ఆ తరువాత సక్సెస్ అనేది ఆయనకి కనుచూమేర కనిపించలేదు.

లవ్ ప్రధానంగా సాగే 'పడి పడి లేచే మనసు' .. యాక్షన్ నేపథ్యంలో వచ్చిన 'రణరంగం' .. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన 'జాను' .. ' గ్రామీణ నేపథ్యంలో రూపొందిన 'శ్రీకారం' ఈ సినిమాలన్నీ కూడా ఆయన అభిమానులను నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో శర్వానంద్ 'మహాసముద్రం' కథను ఎంచుకుని ముందుకు వెళ్లాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో తాను ఉన్న పొజీషన్ నుంచి శర్వానంద్ అడుగైనా ముందుకు వేయలేకపోయాడు.

ఇక ఇప్పుడు ఆయన ముందున్న ఒకే ఒక్క సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. ఈ సినిమాలో శర్వానంద్ జోడీగా రష్మిక కనిపించనుంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రాధిక .. ఊర్వశి ..  ఖుష్బూ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సరదాగా సాగిపోయే కథ ఇది. శర్వానంద్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందువలన ఈ సినిమాతో ఆయన ఆశించే సక్సెస్ లభించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ కూడా తేడా కొడితే మాత్రం శర్వా మరింత డేంజర్ జోన్లోకి వెళ్లినట్టే!  
Tags:    

Similar News