మహేష్ ప్రోగ్రాం రద్దు.. శివాజీ రాజా హాట్ కామెంట్

Update: 2018-12-26 10:45 GMT
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో నిధుల దుర్వినియోగం పై అధ్యక్షుడు శివాజీ రాజా, కార్యదర్శి నరేశ్ లు ఇటీవల పరస్పరం విమర్శలు చేసుకొని మీడియాకెక్కిన సంగతి తెలిసిందే.. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ పరువు తీసేలా ఈ వ్యవహారం దిగజారడంతో సినిమా పెద్దలు రంగంలోకి దిగి ఇద్దరికీ సర్దిచెప్పి సంధి చేశారు. అయితే ఆ గాయాలు మాత్రం మా అధ్యక్షుడు శివాజీరాజాను వీడడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మా లో జరిగిన ఆ ఎపిసోడ్ గురించి పలు సంచలన విషయాలు వెల్లడించాడు.

అమెరికా లో చిరంజీవి ప్రోగ్రాం హిట్ కావడంతో మహేష్ బాబు తో మరో ప్రోగ్రాం ఫిక్స్ చేశామని.. అప్పుడే నరేష్ నిధుల గోల్ మాల్ పై విమర్శలు చేయడంతో ఆ ప్రోగ్రాం అర్థాంతరంగా ఆగిపోయిందని శివాజీ రాజా చెప్పుకొచ్చారు. తాము బాధపడ్డా ఫర్వాలేదు కానీ మహేష్ కు, అమెరికాలో నిర్వాహకులకు ఇబ్బంది కలుగుకూడదనే ప్రోగ్రాం రద్దు చేశామని తెలిపారు. మహేష్, నమ్రత ఇద్దరూ తమకు ఈ విషయంలో ఎంతో సహకరించారని శివాజీ రాజా చెప్పుకొచ్చారు.

ఆరోపణల పై పరస్పరం కేసులు పెట్టుకొని జైలు పాలైతే.. ప్రోగ్రాం నిర్వాహకులు రోడ్డున పడతారనే తాను వెనక్కి తగ్గానని శివాజీ రాజా చెప్పుకొచ్చారు. తనకు, నరేష్ కు ఏమీ కాదని.. అయితే ప్రోగ్రాం నిర్వాహకులు భారీగా నష్టపోతారనే రద్దు చేసినట్టు చెప్పారు.

నిధుల గోల్ మాల్ పై తీవ్ర విమర్శలు చేసిన నరేష్ గారే తర్వాత అలాంటి అక్రమాలు ఏమీ లేవని చెప్పారని శివాజీ రాజా స్పష్టం చేశారు. నరేష్ కు, నాకు ఇగో ప్రాబ్లం వల్లే ఇదంతా జరిగిందని.. పరస్పర అవగాహన, అనుభవం లేకపోవడం వల్లే తమ మధ్య గొడవలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాంలతో కొందరికి పేరు వస్తుందనే ఇలా వెనక్కి లాగుతారంటూ శివాజీరాజా మండిపడ్డారు.

మా అధ్యక్షుడిగా అర్ధరాత్రి ఫోన్ చేసినా ఆపద సమయంలో తన వెంట మూవీ అసోసియేషన్ సభ్యులు వస్తారని.. అంతటి పేరు, మర్యాద తనకు చాలు అని శివాజీ రాజా చెప్పుకొచ్చారు. మాలో తనకు పరుచూరి వెంకటేశ్వరరావు- హీరో శ్రీకాంత్- బెనర్జీ- ఏడిద శ్రీరాం- అనితా చౌదరి- హేమ- నాగినీడులు తన వెంట ఉండి నడిపిస్తున్నారని చెప్పుకొచ్చారు.  

మాలో గొడవలకే ఒక వ్యక్తే కారణమని.. ఆయన రాజకీయాల్లోంచి సినిమాల్లోకి వచ్చి బురద జల్లాడని శివాజీరాజా హాట్ కామెంట్ చేశారు. 32 ఏళ్ల నుంచి ఉంటున్న తనను టార్గెట్ చేశాడని.. వాళ్ల అమ్మను చూసి ఈ విషయాన్ని వదిలేశానని శివాజీరాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tags:    

Similar News