నాగ్.. ఏంటీ అరాచకం?

Update: 2016-01-25 11:30 GMT
అరాచకం కాక మరేమిటి చెప్పండి. ఈ రోజుల్లో సినిమాలకు ఫస్ట్ వీకెండ్ లో హౌస్ ఫుల్స్ పడటమే కష్టంగా ఉంది. కానీ నాగార్జున సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’ మాత్రం రెండో వారంలోనూ హౌస్ ఫుల్స్ తో అదరగొట్టేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడ, ఇక్కడ అని తేడా లేదు.. ప్రతి చోటా అనూహ్యమైన కలెక్షన్లు సాధిస్తోంది నాగ్ మూవీ. బహుశా నాగ్ కూడా తన సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్లు వస్తాయని ఊహించి ఉండడేమో. అంతలా ప్రభంజనం సృష్టిస్తోంది ‘సోగ్గాడే చిన్నినాయనా’. పీఆర్వో బీఏ రాజు సమాచారం ప్రకారం వైజాగ్ సిటీలో ఐదు థియేటర్లలో ఆడుతున్న ‘సోగ్గాడే..’ ఇప్పటిదాకా పది రోజుల్లో ప్రతి షో కూడా ఫుల్ అయ్యిందట. ఒకే సిటీలో ఐదు థియేటర్లలో ఆడుతూ.. ఆ ఐదింట్లోనూ పది రోజల పాటు ఫుల్స్ కావడం అంటే మాటలు కాదు. వీకెండ్స్ లో అయినా ఓకే అనుకుందాం. మరీ వీక్ డేస్ లో కూడా హౌస్ ఫుల్స్ పడటమే ఆశ్చర్యం. తగరపు వలస లాంటి ప్రాంతంలో కూడా పది రోజుల్లో ప్రతి షో కూడా ఫుల్ అయింది.

జిల్లాల్లో షేర్ లెక్కలు చూసినా.. ‘సోగ్గాడే..’కు, మిగతా సంక్రాంతి సినిమాలకు అంతరం చాలా కనిపిస్తోంది. కృష్ణా జిల్లాలో పదో రోజైన ఆదివారం ‘సోగ్గాడే..’ 19.06 లక్షల షేర్ కలెక్ట్ చేయడం విశేషం. అదే రోజు అదే జిల్లాలో నాన్నకు ప్రేమతో రూ.8.04 లక్షలు - ఎక్స్ ప్రెస్ రాజా రూ5.87 లక్షలు - డిక్టేటర్ రూ.3.35 లక్షలు కలెక్ట్ చేయడం గమనార్హం. ఇక హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఆదివారం పరిస్థితి చూస్తే.. సంధ్య 35 ఎంఎంలో ‘సోగ్గాడే..’ నాలుగు షోలూ ఫుల్లయ్యాయి. నాన్నకు ప్రేమతో సుదర్శన్ 35 ఎంఎంలో మార్నింగ్ షో మినహా మూడు షోలు ఫుల్లయింది. ‘ఎక్స్ ప్రెస్ రాజా’కు కూడా మూడు షోలు ఫుల్స్ పడ్డాయి. డిక్టేటర్ మాత్రం ఒక్క షో కూడా ఫుల్లవలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాలుగో వారంలో ఉన్న ‘నేను శైలజ’ కూడా శాంతి థియేటర్ లో ఫస్ట్ షో ఫుల్లయింది.
Tags:    

Similar News