ఇంతకీ మహేష్ టార్గెట్ ఎంత?

Update: 2015-08-01 14:04 GMT
బాహుబలి సినిమా పుణ్యమా అని ఇక టాలీవుడ్ లో ఎవ్వరూ రికార్డుల ఊసెత్తడడానికి లేకుండా పోయింది. ఈ రికార్డుల్ని బద్దలు కొట్టడం మళ్లీ బాహుబలి-2కే సాధ్యమని అందరికీ తెలుసు. ఆ తర్వాత రాజమౌళి సైతం ఈ రికార్డుల్ని అందుకోలేడేమో. మిగతా హీరోలు కూడా బాహుబలి రికార్డుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఐతే బాహుబలిని ప్రత్యేక కేటగిరీలో పెట్టేసి.. దాని గురించి పట్టించుకోవడం మానేస్తే బెటర్. మిగతా సినిమాల్ని బాహుబలి తో పోల్చి చూసుకోవడం వెర్రితనం తప్ప మరేమీ కాదు. కాబట్టి శ్రీమంతుడు విషయంలోనూ బాహుబలి కలెక్షన్ల రికార్డు ప్రస్తావన అనవసరం. దాంతో సంబంధం లేకుండా ‘శ్రీమంతుడు’ ఎంత కలెక్ట్ చేస్తుంది? మహేష్ టార్గెట్ ఏంటి? అన్నది ఆలోచించాలి.

బాహుబలిని పక్కనబెట్టేస్తే.. అత్తారింటికి దారేది రూ.85 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ఆ రేంజి కలెక్షన్లను అందుకునే సత్తా మహేష్ కు ఉందనడంలో ఎవరికీ సందేహాల్లేవు. తెలుగు సినిమా మార్కెట్ ను అంతకంతకూ పెంచిన హీరోల్లో మహేష్ ఒకడు. అతడికి అన్ని వర్గాల ప్రేక్షకుల ఆమోదం ఉంది. అమోఘమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా థియేటర్లకు రప్పించగలడు. గత రెండు సినిమాలు ఫ్లాపయినా ఆ ప్రభావం ఏమీ ‘శ్రీమంతుడు’ మీద కనిపించట్లేదు. మాంచి హైప్ మధ్య సినిమా విడుదలవుతోంది. హిట్ టాక్ వచ్చిందంటే.. కలెక్షన్ల పరంగా మహేష్ కెరీర్లో ది బెస్ట్ అనిపించుకోవడం ఖాయం. అత్తారింటికి దారేదిని దాటి.. రెండో స్థానానికి చేరే అవకాశం కూడా ఉంది. బాహుబలి వల్ల మన మార్కెట్ విస్తృతి కూడా కొంచెం పెరిగింది కాబట్టి.. ఆ రకంగా శ్రీమంతుడుకి కొంచెం కలిసి రావచ్చు. అన్నీ కుదిరితే.. గ్రాస్ వసూళ్లు వంద కోట్ల మార్కును అందుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు. మహేష్ టార్గెట్ కూడా అదే అనుకోవాలి.
Tags:    

Similar News