ఓటీటీలో కార్తీ మూవీ..? కారణం ఇదేనట!

Update: 2020-12-27 09:30 GMT
లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందా? థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా? అని చాలా మంది నిర్మాతలు ఎదురు చూశారు. థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత కూడా కాస్త వెయిట్ చేసి, ఇప్పుడిప్పుడే సినిమాలను వదులుతున్నారు. సంక్రాంతి సీజన్ కు అన్ని ఇండస్ట్రీల్లోనూ బిగ్ స్క్రీన్ పై పలు మూవీస్ సందడి చేయబోతున్నాయి. ఇలాంటి టైంలో థియేటర్లను కాదని.. ఓటీటీ ప్లాట్ ఫాంను ఎంచుకుంటున్నాడట తమిళ్ హీరో కార్తీ!

థియేటర్లు మూసేసిన టైంలో ఫిల్మ్ మేకర్స్ కి ఆశాకిరణంలా కనిపించాయి ఓటీటీలు. అయితే.. వాటిల్లో సినిమా రిలీజ్ చేస్తే ఏం జరుగుతుందో అని అందరూ సంశయిస్తున్న సమయంలో డేర్ చేశారు హీరో సూర్య. త‌న భార్య జ్యోతిక న‌టించిన ‘పొన్ మ‌గల్ వందాల్‌’ను డిజిట‌ల్ ప్లాట్ ఫాంలో రిలీజ్ చేసి సంచ‌ల‌నానికి తెర తీశాడు. ఆ తర్వాత.. తాను న‌టించిన భారీ చిత్రం ‘సురారై పొట్రు‘ (ఆకాశం నీ హ‌ద్దురా) ను సైతం అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసి అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. సూర్య చేసిన సాహసానికి మంచి ఫ‌లితం ద‌క్కింది.

ఈ ఏడాది ఓటీటీ రిలీజ్‌ల్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రం ఆకాశం నీ హద్దురా. ఇండియా వైడ్ గా ఈ మూవీ భారీ సక్సెస్ సాధించిందని సాక్షాత్తూ గూగుల్ లెక్క తేల్చింది. ఆన్లైన్లో నెటిజన్లు చూసిన మూవీస్ లో ఈ చిత్రం రెండో స్థానంలో ఉందని ప్రకటించింది గూగుల్. ఆ తర్వాత సూర్య దారిలో చాలా మంది నడిచారు. తెలుగు, తమిళ్ చిత్రాల్లో చాలా సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి. అయితే.. ఇప్పుడు ఆయన తమ్ముడు కార్తీ కూడా తన సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చూస్తున్నాడని టాక్.

కార్తీ కొత్త సినిమా ‘సుల్తాన్’ త్వరలో రిలీజ్ కాబోతోంది. అయితే.. దీన్ని థియేటర్ బదులు ఓటీటీలో విడుదల చేయాలని చూస్తున్నారట. ఇప్పటికే డిస్నీ+ హాట్ స్టార్ తో సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయ‌ట‌. ఈ న్యూస్ విని అందరూ షాక్ అవుతున్నారు. థియేటర్లు లేని సమయంలో అంటే ఓటీటీలో సూర్య రిలీజ్ చేశాడు. ఇప్పుడు కార్తీకి ఆ అవసరం ఏమొచ్చిందనే సందేహం వ్యక్తం చేస్తున్నారు అందరూ.

అయితే.. విషయం ఏమంటే.. త‌మిళ‌నాట థియేట్రిక‌ల్ రిలీజ్ కోసం విజయ్ ‘మాస్ట‌ర్’ స‌హా చాలా సినిమాలు క్యూలో ఉన్నాయి. పైగా 50 శాతం ఆక్యుపెన్సీతో రన్ చేయాలి. థియేటర్లకు జనం పూర్తిస్థాయిలో రావడం ఇంకా మొదలు కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని సినిమాలతో పోటీ పడి థియేటర్లో రిలీజ్ చేయడం కన్నా.. మంచి ఆఫ‌ర్ వ‌స్తే ఓటీటీలో రిలీజ్ చేయడమే మేల‌ని భావిస్తున్నాడట నిర్మాత సురేష్ ప్ర‌భు.

పైగా.. ఖైదీ త‌ర్వాత కార్తి నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో దీనిపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. దీంతో.. ఓటీటీకే ఓటేస్తోందట యూనిట్. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో ‘సుల్తాన్’ తెర‌కెక్కింది. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఈ చిత్రంతో తమిళంలో అడుగు పెడుతోంది. మరి, ఫైనల్ గా సుల్తాన్ ఏ తెరను ఏలుతాడో చూడాలి.
Tags:    

Similar News