సూపర్ స్టార్‌ 'సింహాసనం' సరికొత్త చరిత్రకి శ్రీకారం

Update: 2022-09-04 15:30 GMT
సూపర్ స్టార్‌ కృష్ణ నటించిన సింహాసనం సినిమాకు టాలీవుడ్ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత ఉంది అనడంలో సందేహం లేదు. తెలుగు లో మొదటి 70 ఎంఎం సినిమా గా సింహాసనం నిలిచింది. అంతే కాకుండా టెక్నాలజీ పరంగా స్టార్ కాస్ట్ పరంగా సింహాసనం ఒక అద్భుతం అంటూ అప్పట్లో ప్రేక్షకులు మరియు సినీ విశ్లేషకులు మాట్లాడుకునే వారు. ఇప్పటికి సింహాసనం ఒక గొప్ప సినిమాగానే పిలవబడుతుంది.

అలాంటి సింహాసనం సినిమాకు మరింత గౌరవం ను కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సూపర్‌ స్టార్‌ కృష్ణ సింహాసనం ను రీ రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపుగా నాలుగు దశాబ్దాల క్రితం వచ్చిన సినిమా అవ్వడం వల్ల ఇప్పుడు థియేటర్లలో ప్రదర్శిస్తే జనాలు రాళ్లు విసిరేయడం ఖాయం. కనుక ఆ సినిమా ను అద్భుతమైన టెక్నాలజీతో కొత్త సినిమాలకు తీసి పోకుండా మార్చుతున్నారట.

సింహాసనం సినిమాను ఏకంగా 8K రిజల్యూషన్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఇప్పటికే పనులు మొదలు అయ్యాయట. పిక్చర్‌ క్వాలిటీ మాత్రమే కాకుండా సౌండ్‌ క్వాలిటీ విషయంలో కూడా అత్యాధునిక టెక్నాలజీని వాడబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. స్టీరియో ఫోనిక్ సౌండ్ సిస్టం ను ఉపయోగించడం ద్వారా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించబోతున్నారట.

ఈ మధ్య కాలంలో పాత సినిమాలు రీ రిలీజ్ అవ్వడం మనం చూస్తున్నాం. పోకిరి సినిమా మరియు జల్సా సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకుని కోట్లలో వసూళ్లను రాబట్టిన విషయం తెల్సిందే. అందుకే ఇప్పుడు 1980 ల్లో విడుదల అయిన సింహాసనం ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఫిల్మ్‌ మేకర్స్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

కాస్త ఖర్చు ఎక్కువ అయినా కూడా సింహాసనం సినిమాను 8K రిజల్యూషన్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా రీ రిలీజ్ ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ లేదు కానీ.. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలతో పోల్చితే అంతకు మించి అన్నట్లుగా సింహాసనం ను రీ రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో కృష్ణ కు జోడీగా జయప్రద.. రాధ మరియు మందాకిని లు నటించారు. కృష్ణ డబుల్‌ రోల్‌ లో నటించి మెప్పించాడు. సింహాసనం కలెక్షన్స్ గురించి దాదాపుగా ఏడాది కాలం పాటు చర్చ జరిగినట్లుగా అప్పటి సినీ ప్రేక్షకులు అంటూ ఉంటారు. కృష్ణ అభిమానులు ఇప్పటికి కూడా సింహాసనం సినిమాని మర్చిపోలేరు అనడంలో సందేహం లేదు.
Tags:    

Similar News