నిర్మాతగా సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు రేంజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన హ్యాండ్ పడిందంటే చాలు.. సినిమాకు అటోమేటిగ్గా అట్రాక్షన్ వచ్చేస్తుంది. మూవీలో ఏదో కంటెంట్ ఉందనే ఫీలింగ్ జనాలకు కలుగుతుంది. అలాంటి బడా నిర్మాత.. ఇప్పుడు హ్యాపీ కౌస్ అంటున్నారు. హ్యాపీ కౌస్ అన్నంత మాత్రాన.. హ్యాపీడేస్ మాదిరిగా ఇదేదో సినిమా పేరు అనుకోకండి.. ఇది ఆయన తన వ్యవసాయ క్షేత్రానికి పెట్టుకున్న పేరు. ప్రస్తుతం ఆర్గానిక్ ఫుడ్ పై అందరికీ ఆసక్తి పెరుగుతోంది. సురేష్ బాబు కూడా హైద్రాబాద్ పరిసరాల్లో సొంతగా ఓ ఫామ్ ల్యాండ్ లో వ్యవసాయం చేస్తున్నారు.
అయితే.. ఇది పాడి వ్యవసాయం మాత్రమే. 30 ఆవులను తనే పెంచుతున్న ఈయన.. ఈ ల్యాండ్ కు హ్యాపీ కౌస్ అంటూ పేరు పెట్టుకున్నారు. తను ఇప్పుడు రైతుగా మారినందుకు చాలా గర్వంగా ఉందని అంటున్నారు సురేష్ బాబు. 'నేను నా ఆవులకు నేనే తిండి పెడతాను.. నీరు పడతాను. ఎంతో స్వచ్ఛమైన పాలు.. నెయ్యిలను పొందుతున్నాను. నేను వాటిని అత్యధిక ధరలకు అమ్మాలని అనుకున్నపుడు.. కుటుంబసభ్యులు అందరూ నవ్వారు. దీంతో నేను సొమ్ము చేసుకోవడం కంటే.. నాణ్యమైన స్వచ్ఛమైన ఉత్పత్తులు-కెమికల్ బేస్డ్ ప్రొడక్టుల మధ్య తేడాను చూపించదలచుకున్నాను' అంటున్నారు సురేష్ బాబు. ఈయన నిర్మించిన ఈ నగరానికి ఏమైంది చిత్రం ఈ నెల 29న విడుల కానున్న సంగతి తెలిసిందే.