బాలీవుడ్ స్టార్ సుశాంత్ రాజ్ పూత్ మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. కొందరు బాలీవుడ్ మాఫియా వల్ల సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ ఆరోపిస్తూ ఉంటే మరికొందరు మాత్రం సుశాంత్ ఆత్మహత్యకు ఆయన ప్రియురాలు అయిన రియా చక్రవర్తి కారణం అయ్యి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సుశాంత్ ఆత్మహత్య కేసును ముంబయి పోలీసులు చాలా లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సమయంలోనే సుశాంత్ తండ్రి కేకే సింగ్ బీహార్ పోలీసులకు రియా చక్రవర్తి పై అనుమానం ఉంది అంటూ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది.
సుశాంత్ కేసును సీబీఐ కి అప్పగించాలంటూ కొందరు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన సోదరి శ్వేత సింగ్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. సోషల్ మీడియా ద్వారా అర్జంట్ రిక్వెస్ట్ అంటూ మోడీని ట్యాగ్ చేసి లేఖను ట్వీట్ చేశారు. ఆ లేఖలో.. ఈ సమయంలో మీరు మాకు మద్దతుగా నిలుస్తారని నా మనసు చెబుతోంది. మాది ఒక సింపుల్ ఫ్యామిలీ.
సుశాంత్ బాలీవుడ్ లో అడుగు పెట్టిన సమయంలో అతడికి ఏ గాడ్ ఫాదర్ లేడు. కష్టపడి బాలీవుడ్ లో మంచి స్థాయికి సుశాంత్ వచ్చాడు. అలాంటి సుశాంత్ మరణంకు సంబంధించిన కేసు విషయంలో మీరు దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. ఈ కేసులో సాక్ష్యాలు తారుమారు కాకముందే మీరు దయచేసి ఈ కేసును పట్టించుకోవాలంటూ మోడీకి విజ్ఞప్తి చేసింది. ఇండియాలో న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. మీరు మా విషయంలో న్యాయం జరిగేలా చేస్తారంటూ నమ్ముతున్నాను అంటూ లేఖలో పేర్కొంది. ఈ కేసును సీబీఐ కి అప్పగించాలంటూ ఆమె ప్రధానిని కోరడంతో బాలీవుడ్ వర్గాల్లో మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.