ట్రాక్‌ లో పందెంకోడి 3 - అభిమ‌న్యుడు 2

Update: 2018-10-23 16:43 GMT
తెలుగువాడైన విశాల్ త‌మిళంలో స్టార్ హీరోగా స‌త్తా చాటుతున్నాడు. విశాల్ సినిమా వ‌స్తోంది అంటే తంబీలు కాపు కాసుకుని  కూచుంటారు. పందెంకోడి సిరీస్‌ లో సీక్వెల్ సినిమా ఇటీవ‌లే రిలీజైన సంగ‌తి తెలిసిందే. `పందెంకోడి 2` త‌మిళంలో `సందెకోజి 2`గా రిలీజై ఘ‌న‌విజ‌యం సాధించింద‌ని నిర్మాత ఠాగూర్ మ‌ధు వెల్ల‌డించారు. తెలుగులోనూ 6కోట్ల‌కు రైట్స్ ఛేజిక్కించుకుంటే - ఆ మేర‌కు షేర్ వ‌సూళ్లు ద‌క్క‌డం సంతోషంగా  ఉంద‌ని అన్నారు. ద‌స‌రా బ‌రిలో పందెంకోడి 2 సంతృప్తిక‌ర ఫ‌లితాన్ని ఇచ్చింద‌ని నేటి సాయంత్రం ప్ర‌శాస‌న్ న‌గ‌ర్‌ లోని ఆయ‌న కార్యాల‌యంలో మాట్లాడుతూ వెల్ల‌డించారు.

పందెంకోడి ఫ్రాంఛైజీలో మూడో సినిమా ఎప్పుడు? అన్న ప్ర‌శ్న‌కు సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే ఉంటుంద‌ని తెలిపారు. ఈసారి గ‌తంలోలాగా ఆల‌స్యం కాద‌ని విశాల్ స్వ‌యంగా చెప్పారు. ఇప్ప‌టికే లైన్ విన్నాను. బాగా ఆస‌క్తి పెంచింది. 2020 లో ఈ సినిమా రిలీజ‌వుతుంది.. అని అన్నారు. `పందెంకోడి 2` విజ‌యానికి కార‌ణం విశాల్ అద్భుత‌మైన పెర్ఫామెన్స్, స్క్రీన్‌ ప్లేని తీర్చిదిద్దిన విధాన‌మేన‌ని అన్నారు. విల‌న్‌ని మించిన పెద్ద‌ మ‌నిషి గా విశాల్ అద్భుత‌మైన మెచ్యూరిటీతో న‌టించాడు. కీర్తి న‌ట‌న అంద‌రికీ న‌చ్చింద‌ని ఠాగూర్ మ‌ధు అన్నారు. త‌దుప‌రి `టెంప‌ర్` త‌మిళ రీమేక్‌ లో విశాల్ న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మేమే నిర్మిస్తున్నాం. ఆ త‌ర్వాత సుంద‌ర్‌.సి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం - బివిఎస్ ఎన్ ప్ర‌సాద్ నిర్మించే సినిమాల్లో విశాల్ న‌టిస్తాడు. ఈలోగానే `అభిమ‌న్యుడు 2` క‌థ రెడీ అవుతోంది. నిర్మాత‌గా - హీరోగా డ్యూయ‌ల్ రోల్‌ ని విశాల్ అద్భుతంగా పోషిస్తున్నార‌ని కితాబిచ్చారు.

`పందెంకోడి 2` ద్విభాషా చిత్రం షూటింగ్ వేళ విశాల్ ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నాడ‌ని, అయితే అది ఎక్క‌డా త‌న‌లో క‌నిపించ‌నివ్వ‌లేద‌ని అన్నారు. హీరోగా - నిర్మాత‌గా ద్విపాత్రాభిన‌యం చేయ‌డంలో విశాల్ నేర్ప‌రి అని అన్నారు. అక్టోబ‌ర్ 18న రెండు భాష‌ల్లో సినిమా రిలీజ్ ఉంది అన‌గా, అక్టోబ‌ర్ 16 రాత్రంతా షూటింగులో పాల్గొన్నాడు విశాల్‌. వేరొక హీరో ఎవ‌రూ అలా చేయ‌లేరు. అంత డెడికేష‌న్ ఉన్న స్టార్ అని అన్నారు. ఒక నిర్మాత అయ్యి ఉంటే..  వేరే ఏ హీరో అలా చేయ‌రు అని అన్నారు. మా సంస్థ‌లో నిర్మించేందుకు.. ప్ర‌స్తుతం ఓ రెండు తెలుగు స్ట్రెయిట్‌ సినిమాల‌కు సంబంధించిన స్క్రిప్టులు రెడీ అవుతున్నాయి. వాటి వివ‌రాల్ని త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని ఠాగూర్ మ‌ధు తెలిపారు.


Tags:    

Similar News