టాప్ స్టోరి: టాలీవుడ్‌ లో 'దేశ‌భ‌క్తి' ఎక్క‌డ‌?

Update: 2019-02-27 04:11 GMT
స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ 1 - 2 గ్రాండ్ స‌క్సెస్. పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదుల్ని తుద‌ముట్టించ‌డంలో భార‌త‌దేశ విజ‌యాన్ని ప్ర‌జ‌లంతా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. జ‌మ్ము క‌శ్మీర్ లో అనాదిగా సాగుతున్న దుర్మార్గ‌పు నాట‌కానికి కొంత‌వ‌ర‌కూ తెర‌ప‌డిన‌ట్ట‌య్యింది. ఇది ప్ర‌జ‌ల్లో మ‌రింత‌గా దేశ‌భ‌క్తిని పెంపొందిస్తోంది. ఇలాంటి స‌న్నివేశంలో దేశ‌భ‌క్తిపై సినిమాల ప‌రిస్థితేంటి? అంటే .. ఓ ర‌కంగా బాలీవుడ్ వ‌ర‌కూ ఓకే కానీ - టాలీవుడ్ లో సందిగ్ధ‌త నెల‌కొంద‌నే చెప్పొచ్చు. ప్ర‌తిసారీ మూస‌లో ప‌డిపోయి ఒకే దారిలో వెళ్ల‌డం అన్న‌ది ప‌రిశ్ర‌మ‌లో ఉంది. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కొన‌సాగుతోంది.

ఒక‌ప్పుడు దేశ‌భ‌క్తి కాన్సెప్టుల‌తో సినిమాలు తీసేవారు టాలీవుడ్ లో. కానీ ఇప్పుడు అది జీరో స్థాయికి ప‌డిపోయింది. ల‌వ్ స్టోరీలు - హార‌ర్ - క్రైమ్ థ్రిల్ల‌ర్ల‌పై ఉన్న మోజు దేశ‌భ‌క్తి సినిమాల‌పై లేనేలేదు. మ‌న ఫిలింమేక‌ర్స్ దృష్టి వాటిపై ప‌డిన సంద‌ర్భ‌మే క‌నిపించ‌లేదు. వ్య‌క్తిగ‌తంగా మ‌న ఫిలింమేక‌ర్స్ లో దేశ‌భ‌క్తి ఉంటే స‌రిపోదు.. సినిమాలు తీసి బ్లాక్‌ బ‌స్ట‌ర్లు కొట్టి దేశ‌భ‌క్తిని జ‌నంలోకి పంప్ చేయాలి. అప్పుడే ప్రూవ్ చేసుకున్న‌ట్టు. ఈ విష‌యంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ని గుర్తు చేసుకోవాల్సిన సంద‌ర్భం ఇదే. అత‌డు న‌టించే ప్ర‌తి సినిమాలో దేశ‌భ‌క్తిని చాటే - స్ఫూర్తిని ర‌గిలించే ఏదో ఒక అంశాన్ని త‌ప్ప‌నిస‌రిగా జోడించాల‌న్న నిబంధ‌న ఉండేది. ప‌వ‌న్ న‌టించిన ప్ర‌తి సినిమాలోనూ దేశ‌భ‌క్తి క‌నిపించింది. అంత‌కుముందు మేజ‌ర్ చంద్ర‌కాంత్ - ఆజాద్ - కాలాపాని - భార‌తీయుడు స‌హా ఎన్నో దేశ‌భ‌క్తి ప్ర‌ధాన చిత్రాలు వ‌చ్చి టాలీవుడ్ లో ఘ‌న‌విజ‌యం సాధించాయి. కానీ ఇటీవ‌లి కాలంలో అలాంటి ప్ర‌య‌త్న‌మే సాగ‌డం లేదు. ఆ త‌ర‌హా క‌థ‌ల్ని మ‌న ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు త‌యారు చేసుకుంటున్న వైనం క‌నిపించ‌డం లేదు.

కార్గిల్ వీరుల క‌థ‌ల్ని - యూరి ఎటాక్స్ క‌థ‌ల్ని బాలీవుడ్ వాళ్లే తీస్తున్నారు. టాలీవుడ్ లోనూ తీయ‌గ‌లిగే స‌త్తా ఉన్న ద‌ర్శ‌కులు ఉన్నా.. అలాంటి యూనివ‌ర్శ‌ల్ యాక్సెప్టెన్సీ ఉన్న‌ క‌థ‌ల్ని ఎందుకు ఎంచుకోరు? అన్న ప్ర‌శ్న‌కు స‌రైన స‌మాధానం లేదు. ఇటీవ‌లే దేశ‌భ‌క్తి క‌థాంశంతో `యూరి (యుఆర్ ఐ) :  ది స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్` వ‌చ్చి 300కోట్లు వ‌సూలు చేసింది. దీని సీక్వెల్ గా `యూరి:  ది స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ 2` తీసే ఛాన్సు ఉందని అర్థ‌మ‌వుతోంది. తాజాగా పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదుల్ని ఏరివేసేందుకు భార‌త వైమానిక ద‌ళం చేసిన సాహ‌సంపై క‌థాంశం రెడీ చేసేందుకు `యూరి` టీమ్ ప్రిపేర‌వుతోంద‌నే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఒక సాహ‌స ఘ‌ట్టం ఎంత‌టి స్ఫూర్తిని నింపుతుందో ఊహాతీతం. బాక్సాఫీస్ విక్ట‌రీకి అది క‌లిసొస్తుంది. `యూరి 2` తీస్తే హిట్టివ్వ‌డానికి ప్ర‌జ‌లు ముందే గ్యారెంటీ ఇస్తార‌న‌డంలో సందేహం లేదు. అంత‌టి క్యూరియాసిటీ రెయిజ్ అయ్యింది. అయితే ఇలాంటి సినిమాలు టాలీవుడ్ లో తీయ‌లేరా? తీసే స‌త్తా లేనే లేదా?  మ‌న ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు - నిర్మాత‌ల్లో దేశ‌భ‌క్తి లేదా? ఇండియా నంబ‌ర్ 1 (దేశీ వ‌సూళ్ల‌లో టాప్) సినిమా `బాహుబ‌లి 2`ని అందించిన ఘ‌నుడు ఎస్.ఎస్‌.రాజ‌మౌళి టాలీవుడ్ తురుపు ముక్కే క‌దా? ఆయ‌న‌ ఇలాంటివి ప్ర‌య‌త్నిస్తే సంచ‌ల‌న‌మే అవుతుంది క‌దా?  ప్ర‌స్తుతం జ‌క్క‌న్న తెర‌కెక్కిస్తున్న ఆర్‌.ఆర్‌.ఆర్ ఆ త‌ర‌హానే అన్న ప్ర‌చారం సాగుతోంది. అయితే ఇది ప్రీ ఇండిపెండెన్స్ టైమ్ క‌థాంశం అన్న చ‌ర్చా సాగుతోంది. ఇక ఆర్జీవీ - పూరి లాంటి  సీనియ‌ర్లు వెట‌కారం సినిమాలేనా?  ఇలాంటివి తీయ‌రా?  అందుకేనా ఈ వెన‌క‌బాటు? అన్న‌ది ఆలోచించుకోవాల్సి ఉంది.
Tags:    

Similar News