మూవీ రివ్యూ: తను నేను

Update: 2015-11-27 08:37 GMT
చిత్రం : తను నేను

నటీనటులు- సంతోష్ శోభన్ - అవికా గోర్ - రవిబాబు - సత్యకృష్ణ - రోహిత్ వర్మ - మూర్తి కావలి తదితరులు
సంగీతం- సన్నీ ఎం.ఆర్
ఛాయాగ్రహణం- సురేష్
కథ - స్క్రీన్ ప్లే - మాటలు- సాయి సుకుమార్
నిర్మాణం- సన్ షైన్ సినిమాస్ - వయాకామ్ 18 పిక్చర్స్
దర్శకత్వం- పి.రామ్మోహన్

అష్టాచెమ్మా - గోల్కొండ హైస్కూల్ - ఉయ్యాల జంపాల లాంటి విభిన్నమైన సినిమాలతో నిర్మాతగా మంచి పేరు సంపాదించాడు రామ్మోహన్. ఈ సినిమాల రచనా విభాగంలోనూ ఓ చేయి వేసిన రామ్మోహన్.. తనే దర్శకుడిగా మారి తీసిన ‘తను నేను’ సినిమా న్యూ వేవ్ సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకుల్ని బాగానే ఆకర్షించింది. మరి ఆ ఆసక్తికి తగ్గట్లు సినిమా తెరకెక్కిందో లేదో చూద్దాం పదండి.

కథ:

కిరణ్ (సంతోష్ శోభన్) కాల్ సెంటర్ జాబ్ చేస్తూ సరదాగా జీవితాన్ని గడిపేసే కుర్రాడు. అతడికి అమెరికా అన్నా, అక్కడుండే మన ఎన్నారైలన్నా అసహ్యం. అలాంటి వాడికి అమెరికా వెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్న కీర్తి (అవికా గోర్) పరిచయమవుతుంది. ఆమెను ప్రేమిస్తాడు. తనూ అతణ్ని ప్రేమిస్తుంది. ఐతే తన అమెరికా కలకు అడ్డం పడుతున్నాడన్న కారణంతో కిరణ్ పై పగబడతాడు కీర్తి తండ్రి బండ్రెడ్డి సర్వేశ్వరరావు (రవిబాబు). మరి కీర్తి తండ్రి కోరిక ప్రకారం అమెరికా వెళ్లిందా? లేక కిరణ్ కోసం ఇక్కడే ఉండిపోయిందా? ఇంతకీ బండ్రెడ్డి పరిస్థితి ఏంటి? అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

రామ్మోహన్ నిర్మాణంలో వచ్చిన మూడు సినిమాలు చూస్తే.. అందులో కాన్సెప్ట్ చాలా సింపుల్‌గా ఉంటుంది. కథల విషయంలో నేల విడిచి సాము చేయలేదు. చాలా మామూలుగా అనిపించే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథలకు ఆహ్లాదకరమైన కథనం - నటీనటుల ప్రతిభ - మంచి టెక్నికల్ వాల్యూస్ తోడై ఆ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు మంచి అనుభూతిని మిగిల్చాయి.

దర్శకుడిగా తొలి ప్రయత్నంలో రామ్మోహన్ ఈ సినిమాల ఫార్ములానే ఫాలో అయ్యాడు. చాలా సింపుల్ గా అనిపించే కథను ఎంచుకున్నాడు. మంచి నటీనటుల్ని తీసుకున్నాడు, టెక్నికల్ టీం కూడా మంచి ఔట్ పుట్ ఇచ్చింది. ఎటొచ్చీ సమస్యంతా కథనంతోనే. ఎంచుకున్న ప్లాట్ బావున్నప్పటికీ.. స్క్రీన్ ప్లే తేడా కొట్టేయడంతో ‘తను నేను’ అనుకున్నంతగా ఆహ్లాదం పంచలేకపోయింది.

హీరో పేరు చూసి హీరోయిన్ ప్రేమించడం.. దాని చుట్టూ ఓ సినిమా కథను నడపడం అన్నది చాలా రిస్కీ వ్యవహారం. వినడానికి చాలా సిల్లీగా అనిపిస్తుంది. కానీ ‘అష్టాచెమ్మా’లో ఈ పాయింటుని ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా చెప్పడంలో మోహనకృష్ణ సక్సెస్ అయ్యాడు. ‘తను నేను’లో కూడా ఇలాంటి సిల్లీ పాయింట్ ఒకటుంది. హీరో హీరోయిన్ల మధ్య విభేదాలు వచ్చి విడిపోవడానికి దారితీసే కీలకమైన పాయింటిది. అది వినడానికే కాదు.. చూడ్డానికి కూడా సిల్లీగా అనిపించడంతో అంతవరకు ఓ మోస్తరుగానే సాగిన ‘తను నేను’ ప్రేక్షకుడిని నిట్టూర్చేలా చేస్తుంది.

కాల్ సెంటర్ జాబ్ చేసే హీరో.. ఎన్నారైలు లైన్లోకి రాగానే బూతులు తిట్టేస్తుండటం కన్విన్సింగ్ గా అనిపించదు. ఐతే క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడులే అని సరిపెట్టుకోవచ్చు. హీరోయిన్ హీరోను ఉన్నట్లుండి ప్రేమించేయడం కానీ.. అతడి కోసం తన యుఎస్ కలను అటకెక్కించేయడం కానీ.. లాజికల్ గా అనిపించవు. కథనం కొంచెం వేగంగానే సాగిపోతుండటంతో సర్దుకుపోవచ్చు ఇలా ప్రథమార్ధం వరకు బండి ఓ మోస్తరుగానే నడిచిపోతుది. కానీ ద్వితీయార్ధంలో కథను మలుపు తిప్పే సన్నివేశం దగ్గరే వస్తుంది సమస్య.

మామ బాధ వదిలించుకోవడానికి హీరో వేసే ప్లాన్.. ఆ ప్లాన్ తర్వాత కథ మలుపు తిరిగే తీరు సిల్లీగా అనిపిస్తాయి. ఇక ఆ తర్వాత దర్శకుడు ఏం చూపించినా.. ఎంత డ్రామా పండించే ప్రయత్నం చేసినా కన్విన్సింగ్ గా అనిపించే అవకాశం లేకపోయింది. హీరో హీరోయిన్ల పాత్రల్ని సరిగా తీర్చిదిద్దలేదు కానీ.. రవిబాబు పోషించిన బండ్రెడ్డి పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ పాత్ర కనిపించిన ప్రతిసారీ వినోదం పండుతుంది. రవిబాబు-సత్యకృష్ణ.. రవిబాబు-సంతోష్ మధ్య వచ్చే సన్నివేశాలు బావున్నాయి. ఐతే బండ్రెడ్డి క్యారెక్టర్ని మరింతగా పొడిగించకపోవడం నిరాశ పరుస్తుంది. ఈ పాత్రను చివరిదాకా కొనసాగిస్తే ఇది మరో ‘సినిమా చూపిస్త మావ’ అవుతుందనుకున్నాడేమో రామ్మోహన్.. కొత్తదనం కోసం ఆ పాత్రకు తెరదించేశాడు. అక్కడి నుంచే సినిమా గాడి తప్పింది.

ఎంచుకున్న ప్లాట్ బాగుంది. రవిబాబు పాత్రనూ బాగా రాసుకున్నారు. అక్కడక్కడా కొన్ని కామెడీ సన్నివేశాలు పండాయి. నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా సినిమా కోసం తమ వంతు చేయాల్సింది చేశారు. కానీ ప్లాబ్లెం అంతా కథనంతోనే. అక్కడే ‘తను నేను’ నిరాశ పరిచింది.

నటీనటులు:

‘గోల్కొండ హైస్కూల్’ సినిమాలో క్రికెట్ టీం కెప్టెన్ గా ఆకట్టుకున్న సంతోష్ శోభన్ హీరోగా తొలి సినిమాలోనూ ప్రామిసింగ్ గా అనిపించాడు. రామ్మోహన్ బేనర్లోనే పరిచయమైన నాని, అవసరాల శ్రీనివాస్, రాజ్ తరుణ్ ల మాదిరే సహజంగా నటించడానికి ట్రై చేశాడు. అతడి డిక్షన్ బాగుంది. ఐతే హావభావాలు, డైలాగ్ డెలివరీలో అక్కడక్కడా నిలకడ తప్పాడు. అనుభవం మీద సంతోష్ మంచి నటుడిగా ఎదిగే అవకాశముంది. అవికా గోర్ ఎప్పట్లాగే హీరోయిన్ అన్న ఫీలింగ్ కలిగించకుండా ఓ మామూలు అమ్మాయిలా కనిపించింది. ఆమెకు అదే ప్లస్, అదే మైనస్. ఫిజిక్ విషయంలో, గ్లామర్ విషయంలో ఆమెకు మంచి మార్కులు పడవు. నటన ఓకే. రవిబాబు తనదైన శైలిలో నటించి మెప్పించాడు. సత్యకృష్ణకు పెద్దగా స్కోప్ లేకపోయింది. హీరో ఫ్రెండు నరేష్ గా, క్యాస్ట్ ఫీలింగ్ శ్రీకాంత్ గా నటించిన ఇద్దరు కుర్రాళ్లు బాగానే చేశారు.

సాంకేతిక నిపుణులు:

సన్నీ ఎం.ఆర్. ఇలాంటి ఆఫ్ బీట్ సినిమాలకు తన సంగీతం బాగా సూటవుతుందని మరోసారి రుజువు చేశాడు. అతడి పాటలు, నేపథ్య సంగీతం ప్లెజెంట్ ఫీలింగ్ కలిగిస్తాయి. సురేష్ ఛాయాగ్రహణం కూడా సింపుల్ గా బాగుంది. మామూలు లొకేషన్లనే బాగా చూపించాడు. ఈ సినిమాకు సాయి సుకుమార్ తో కలిసి రామ్మోహనే కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. సినిమాకు మేజర్ మైనస్ స్క్రీన్ ప్లేనే. పంచ్ డైలాగుల కోసం పాకులాడకుండా సన్నివేశాలకు తగ్గట్లు సింపుల్ డైలాగులే రాశారు. దర్శకత్వ పరంగా రామ్మోహన్ ప్రత్యేకత కొన్నిచోట్ల కనిపిస్తుంది. హడావుడి లేకుండా సింపుల్ గా సాగే అతడి నరేషన్ స్టయిల్ ఓకే. కానీ కన్సిస్టెన్సీ లేకపోవడం సమస్య.

చివరగా- ఆమె అతడు.. అంత కిక్కివ్వలేదు

రేటింగ్- 2.25/5
Tags:    

Similar News