ట్రైలర్: కాశ్మీర్ మారణహోమాన్ని ఆవిష్కరించిన 'ది కాశ్మీర్ ఫైల్స్'

Update: 2022-02-21 08:20 GMT
ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ''ది కాశ్మీర్ ఫైల్స్" అనే ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు పొందిన నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

కాశ్మీర్ మారణహోమం నిజమైన కథ ఆధారంగా రూపొందిన మొట్ట మొదటి సినిమా ఇది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కొద్దిసేపటి క్రితం థియేట్రికల్ ట్రైలర్ ను ఆవిష్కరించారు.

"ది కాశ్మీర్ ఫైల్స్" సినిమా కశ్మీర్ నేపథ్యంలో సున్నితమైన అంశాలతో బలమైన భావోద్వేగాలతో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇందులో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్స్ మిథున్ చక్రవర్తి - అనుపమ్ ఖేర్ మరియు పల్లవి జోషి ప్రధాన పాత్రలు పోషించారు.

పునీత్ ఇస్సార్ - అర్పణ్ భిఖారి మరియు భాషా సంబ్లి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. 90వ దశకంలో కాశ్మీర్‌ లో నెలకొన్న భయానక భయాందోళనలను భీభత్సాన్ని ప్రేక్షకులకు తెలియజేసేలా ఈ చిత్రాన్ని రూపొందించారని అర్థం అవుతోంది.

క్రూరమైన నిజాయితీ గల హార్డ్ హిట్టింగ్‌ స్టోరీని ఎమోషనల్‌ గా చెప్పబోతున్నారని తెలుస్తోంది. ఆనాటి విషాద సంఘటన సమయంలో భావోద్వేగాలను ఆవిష్కరిస్తోన్న ఈ ట్రైలర్‌ లో ఉన్న పవర్-ప్యాక్డ్ డైలాగ్స్ - బీజీఎమ్ గూస్‌ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.

ఆర్టికల్ 370 చుట్టూ జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా పీరియాడిక్ డ్రామాగా "కాశ్మీర్ ఫైల్స్" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆర్టికల్ 370 చట్టాన్ని తీసుకురావడానికి.. ఇటీవల తొలగించడానికి గల కారణాలను ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేసారు.

కాశ్మీర్ మారణహోమం యొక్క క్రూరమైన నిజాయితీ కథను ధైర్యంగా చెప్పడానికి ఈ "కాశ్మీర్ ఫైల్స్" చిత్రాన్ని రూపొందించినందుకు నిర్మాతను అభినందించాలి. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో జీ స్టూడియోస్ తో కలిసి అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అర్చన అగర్వాల్ - వివేక్ అగ్నిహోత్రి - పల్లవి జోషి సహ నిర్మాతలుగా వ్యవహరించారు.

నిజానికి "కాశ్మీర్ ఫైల్స్" సినిమాని రిపబ్లిక్ డే సందర్భంగా 2022 జనవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేసారు. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఇప్పుడు మార్చి 11న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

32 ఏళ్ళ క్రితంనాటి సెన్సిటివ్ పాయింట్ ని తీసుకొని న్యాయ హక్కు గురించి తెలియజెప్పనున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Full View
Tags:    

Similar News