ఓటీటీల సరికొత్త స్ట్రాటజీ ఇదే..!

Update: 2022-09-03 05:03 GMT
కరోనా సమయంలో ఓటీటీలు విశేష ఆదరణ దక్కించుకున్నాయనే సంగతి తెలిసిందే. పాండమిక్ లో థియేటర్లు మూతబడి ఉండటంతో ప్రేక్షకులు వినోదం కోసం డిజిటల్ వేదికలను ఆశ్రయించారు. దీన్ని క్యాష్ చేసుకోడానికి ఓటీటీ సంస్థలు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ను అందించడానికి ప్రయత్నం చేసాయి. ఈ విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యాయి.

వీక్షకులను ఆకట్టుకునేందుకు సరికొత్త బ్లాక్ బస్టర్ సినిమాలు మరియు ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లతో సందడి చేశాయి. పోటీపడి మరీ ఫ్యాన్సీ రేట్లకు డైరెక్ట్ ఓటీటీ రిలీజులను తీసుకున్నారు. అయితే ఇప్పుడు థియేటర్లు ఎప్పలిగానే తెరుచుకోవడంతో ఓటీటీల హడావుడి మునుపటి కంటే కాస్త తగ్గింది. అందులోనూ తెలుగులో 50 రోజుల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ చేయాలనే నిబంధనలు వచ్చాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఓటీటీలు కూడా సరికొత్త స్ట్రాటజీలతో పరస్పర సహకారంతో ముందుకు వెళ్తున్నాయి. ఎంత భారీ రేటుకు డిజిటల్ రైట్స్ తీసుకున్నా.. అందరూ డబ్బు కట్టి ఓటీటీ సబ్ స్క్రైబ్స్క్రిప్షన్ తీసుకోరు కాబట్టి.. ఇప్పుడు షేరింగ్ పద్ధతిలో సినిమాలను స్ట్రీమింగ్ కు పెడుతున్నారు.

కొత్త సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఒకే ఓటీటీ తీసుకోకుండా.. ఇందులో ఇతర సంస్థని కలుపుకోవడమో లేదా ఒకరు తీసుకున్న చిత్రాన్ని మరో ఓటీటీతో పంచుకోవడమో చేస్తున్నారు. ఈ విధంగా వ్యూయర్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు అన్ని ఓటీటీలు ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి.

ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన RRR సినిమా హిందీ డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ ఓటీటీ దక్కించుకోగా.. నాలుగు దక్షిణాది భాషల వెర్షన్స్ Zee5 ఓటీటీ తీసుకుంది. అయితే ఇటీవల జీ గ్రూప్ ఈ మూవీ తెలుగు తమిళ మలయాళ కన్నడ వెర్సన్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో షేర్ చేసుకుంది.

'భీమ్లా నాయక్' మూవీని ఆహా మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలు స్ట్రీమింగ్ చేశాయి. 'ఎఫ్ 3' చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ మరియు సోనీ లివ్ ఓటీటీలు పంచుకున్నాయి. అలానే 'పక్కా కమర్షియల్' సినిమాని 'ఆహా' తో పాటు నెట్ ఫ్లిక్స్ కు ఇచ్చారు. గతంలో 'అల వైకుంఠపురములో' సినిమాని నెట్ ఫ్లిక్స్ & సన్ నెక్స్ట్ లలో ప్రసారం చేశారు.

ఇప్పుడు లేటెస్టుగా బ్లాక్ బస్టర్ 'విక్రమ్' సినిమా కూడా ఇదే పద్దతిలో స్ట్రీమింగ్ కాబోతోంది. కమల్ హాసన్ నటించిన ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న డిస్నీ+హాట్ స్టార్.. ఇప్పటికే ఓటీటీలోకి వదిలింది. అయితే ఈ సినిమాని ఇప్పుడు జీ5 ఓటీటీతో షేర్ చేసుకోబోతోంది. వచ్చే వారం నుంచి 'విక్రమ్' సినిమాని స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంచుతారు.

ఇలా ఓటీటీలన్నీ కొత్త సినిమాలను షేరింగ్ పద్దతిలో స్ట్రీమింగ్ చేస్తున్నాయి. కాకపోతే రెండింటి మధ్య డేట్స్ పరంగా కొంత వ్యత్యాసం ఉండేలా చూసుకుంటున్నారు. ఈ స్ట్రాటజీ వల్ల ఎక్కువ వ్యూయర్ షిప్ రావడమే కాదు.. రీచ్ కూడా బాగా ఉంటుంది. ఇది పరోక్షంగా ఆ సినిమాకు సంబంధించిన వారందరికీ ఉపయోగపడుతుందని చెప్పాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News