ఫోక‌స్‌: ముగ్గురు లేక‌పోతే ముచ్చటేస్తల్లే!!

Update: 2015-11-06 17:30 GMT
ఒక పెళ్లాం ముద్దు, రెండో పెళ్లాం వ‌ద్దు అని ఓ క్యాప్ష‌న్ ఎప్ప‌ట్నుంచో పాపుల‌ర్ అయ్యి ఉంది. అది నిజ జీవితాల్ని నిల‌బెట్టేందుకు. మ‌రి వెండితెర‌పై ఒక పెళ్లాంలాగా ఒకే హీరోయిన్ ఉంటే కుదురుతుందా? ఆడియెన్‌కి బోర్ కొట్ట‌దూ?  యూత్‌కి టెంప‌ర్ లేచిపోదూ? అందుకే మ‌న ద‌ర్శ‌క‌హీరోలు తెలివిగా ఇద్ద‌రేసి, ముగ్గురేసి హీరోయిన్ల‌ను హైర్ చేసుకుంటున్నారు. ఇందులో ఓ ఐటెమ్ భామ‌ను కూడా ఎటాచ్ చేస్తున్నారు. అప్పుడు మాత్ర‌మే కిక్కు అని భావిస్తున్నారు.

అది కూడా నిజ‌మే. సినిమా అంటేనే గ్లామ‌ర్‌. ఆ గ్లామ‌ర్ తెచ్చేది హీరోయిన్‌. కాబ‌ట్టి ఎంత‌మంది ఎక్కువ హీరోయిన్‌ లు ఉంటే అంత కిక్కొచ్చిన‌ట్ట‌న్న‌మాట‌! ఆ రోజుల్లోనే ఏఎన్నార్‌ - శోభ‌న్‌ బాబు లాంటి రొమాంటిక్ హీరోలు ఇద్ద‌రేసి, ముగ్గురేసి హీరోయిన్ల‌తో ల‌వ్వాయ‌ణం సాగించిన సంద‌ర్భాలున్నాయి. ఆ త‌ర్వాత చిరంజీవి - బాల‌కృష్ణ‌ - నాగార్జున ఆ వార‌స‌త్వాన్ని కాపాడారు. అత్తో అత్త‌మ్మ కూతురా అంటూ.. అల్లుడా మ‌జాకాలో చిరంజీవి అత్త‌తో - ఇద్ద‌రు అత్త కూతుళ్ల‌తో స్టెప్పులేసిన వైనం ఇంకా మ‌ర్చిపోలేదు. నారీ నారీ న‌డుమ మురారి అంటూ బాల‌య్య బాబు ఇద్ద‌రు నారీమ‌ణుల మ‌ధ్య న‌లిగిపోయిన సంగ‌తిని మ‌ర్చిపోలేం. ఆవిడా మా ఆవిడే .. అమ్మ బ్ర‌హ్మ దేవుడో అంటూ నాగార్జున రొమాన్స్ చేసిన తీరు ఇప్ప‌టికీ డిస్క‌ష‌న్ పాయింట్. అయితే ఇటీవ‌లి కాలంలోనూ ఇద్ద‌రేసి, ముగ్గురేసి హీరోయిన్లు లేనిదే సినిమాలు రావ‌డం లేదు.

బాల‌య్య సింహా - ల‌య‌న్ -  లెజెండ్ ల‌లో ఇద్ద‌రేసి - ముగ్గురేసి ముద్దుగుమ్మ‌లు న‌టించారు. అంత‌కంటే ముందే స‌మ‌ర‌సింహారెడ్డి - న‌ర‌సింహానాయుడు లోనూ ఇదే బాప‌తులో ముగ్గురు నాయిక‌లు ఉన్న సంద‌ర్భాలున్నాయి. అంతేకాదు లేటెస్టుగా శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న డిక్టేట‌ర్‌ లోనూ ముగ్గురేసి భామ‌లున్నారు.  ప్ర‌స్తుతం మ‌హేష్ స‌ర‌స‌న బ్ర‌హ్మోత్స‌వంలో స‌మంత‌ - కాజ‌ల్ - ప్ర‌ణీత క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. అలాగే మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న బెంగాల్‌ టైగ‌ర్ చిత్రంలో ముగ్గురు భామ‌లు.. త‌మ‌న్నా - రాశీ ఖ‌న్నా - హంసానందిని ఆడిపాడుతున్నారు. అల్లు అర్జున్  హీరోగా బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రంలోనూ ర‌కూల్ -  క్యాథ‌రిన్‌ ల‌తో పాటు మ‌రో ఐటెమ్ భామ ఆడిపాడుతున్నారు. ఇలా చూస్తే  ఏ సినిమాని క‌దిలించినా ఇద్ద‌రు ముగ్గురు ముద్దుగుమ్మ‌లు లేనిదే కంటెంట్ లేదు. అర్థ‌మైంది క‌దూ?

Tags:    

Similar News