టాలీవుడ్ స్టార్ హీరోల షష్టిపూర్తి క‌హానీ

Update: 2019-08-27 01:30 GMT
స్టార్ హీరోలు త‌మ వ‌య‌సు గురించి వేదిక‌ల‌పై మాట్లాడ‌డం అన్న‌ది అరుదైన స‌న్నివేశ‌మే. ఇటీవ‌లే కింగ్ నాగార్జున `మ‌న్మ‌ధుడు 2` మీడియా చిట్ చాట్ లో త‌న వ‌య‌సు గురించి.. ష‌ష్ఠిపూర్తి గురించి మాట్లాడి షాకిచ్చారు. వ‌య‌సును దాచుకునేందుకు ఆయ‌న‌లో ఎలాంటి ఉబ‌లాటం క‌నిపించ‌క‌పోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆగ‌స్టు 29తో నాగార్జునకు 60 వ‌సంతాలు. ష‌ష్టిపూర్తి సెల‌బ్రేష‌న్స్ కి ఆయ‌న రెడీ అవుతున్నారు. కింగ్ 60వ బ‌ర్త్ డే వేడుక‌ల్ని వార‌సులు స్పెయిన్ లో గ్రాండ్ గా ప్లాన్ చేశార‌ని ఇదివ‌ర‌కూ వార్త‌లు వ‌చ్చాయి.

ఆయ‌న‌లానే మ‌రో సీనియ‌ర్ హీరో కూడా ష‌ష్టి పూర్తికి రెడీ అవుతున్నాన‌ని ప్ర‌క‌టించి షాకిచ్చారు. ఆగ‌స్టు 28 సుమ‌న్ 60వ బ‌ర్త్ డే. ఆయ‌న కూడా ష‌ష్టిపూర్తికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఆరు ప‌దుల వ‌య‌సుకు చేరువైన తాను.. ప‌రిశ్ర‌మ‌లో నాలుగు ద‌శాబ్ధాల పాటు కెరీర్ ని సాగించాన‌ని హైద‌రాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్ల‌బ్ లో జ‌రిగిన ప్ర‌జా డైరీ మ్యాగ‌జైన్ కొత్త‌ సంచిక ఆవిష్క‌ర‌ణ‌లో ఆయ‌న తెలిపారు. అంతేకాదు సుమ‌న్ ష‌ష్ఠిపూర్తి బ్రోచ‌ర్ ని ఈ సంద‌ర్భంగా ఆవిష్క‌రించారు. సుమ‌న్ పుట్టి పెరిగింది చెన్న‌య్ లో. మంగుళూరు స్వ‌స్థ‌లం. 11 ఏళ్ల‌కే క‌ర్ర‌సాము- బాడీ బిల్డింగ్ లో రాటు దేలిన సుమ‌న్ మార్ష‌ల్ ఆర్ట్స్ తెలిసిన అరుదైన హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఒకానొక ద‌శ‌లో మెగాస్టార్ చిరంజీవి.. నంద‌మూరి బాల‌కృష్ణ‌ల‌తో స‌మాన‌మైన స్టార్ డ‌మ్ ని అందుకున్న ఆయ‌న కెరీర్ ఊహించ‌ని మ‌లుపుల‌తో డౌన్ ఫాల్ అయిన సంగ‌తి తెలిసిందే.

సుమ‌న్ ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డ‌మే గాక‌.. రాజ‌కీయాల్లోనూ కొన‌సాగుతున్నారు. చాలా కాలంగా తేదేపాలో కొన‌సాగుతున్నారు. ఎన్నిక‌ల ముందు ప‌లుమార్లు చంద్ర‌బాబుతోనూ మంత‌నాలు సాగించిన ఆయ‌న‌  తేదేపా త‌ర‌పున పోటీ చేస్తార‌నే ప్ర‌చార‌మూ సాగింది. అయితే పార్టీ టిక్కెట్ ద‌క్క‌లేదు. ఎన్నిక‌ల వేళ కొన్ని ప్రాంతాల్లో ఆయ‌న త‌న‌కు సన్నిహితంగా ఉన్న‌వారి కోసం ప్ర‌చారం చేసి స‌రిపుచ్చుకున్నా. ఎన్నిక‌ల్లో వైకాపా ఘ‌న‌విజ‌యం సాధించాక ప‌.గో జిల్లాలో ఓ ప‌ర్య‌ట‌న‌లో పాల్గొన్న సుమ‌న్.. వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎన్నో క‌ష్టాల‌కు ఎదురీది ఘ‌న విజ‌యం సాధించార‌ని అభినందించారు.  మంత్రి వ‌ర్గంలో ఎస్సీ- ఎస్టీ- బీసీ- మైనార్టీ-  కాపులకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి సమన్యాయం చేసిన ఘనత జగన్‌ కే దక్కుతుందని ప్ర‌శంసించారు. ఏపీకీ సినిమా ప‌రిశ్ర‌మ‌ను తీసుకొచ్చి అన్ని ర‌కాలుగా ఆదుకోవాల‌ని ఆయ‌న సీఎం జ‌గ‌న్ కు విజ్ఞప్తి చేసారు.
Tags:    

Similar News