త్రివిక్రమ్ అయినా... బన్నీ రూటదే

Update: 2018-11-12 11:27 GMT
టాలీవుడ్లో మిగతా స్టార్ హీరోలందరూ వేగం పెంచారు కానీ.. అల్లు అర్జున్ మాత్రం పాత రూట్లోనే నడుస్తున్నాడు. అతను ఒక సినిమాకు.. ఇంకో సినిమాకు మధ్య చాలా గ్యాప్ తీసుకుంటాడు. ఒక సినిమా చేస్తుండగానే ఇంకోదానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఇది పూర్తవగానే అది మొదలుపెట్టేయడం.. ఇలా బన్నీ చేయడు. ఒక సినిమా ముగిసిన తర్వాతే స్టోరీ సిట్టింగ్స్‌లో కూర్చుంటాడు. తనకు పూర్తి సంతృప్తి కలిగాకే సినిమాకు ఓకే చెబుతాడు.. తర్వాత నెమ్మదిగా సినిమాను మొదలుపెట్టి.. తాపీగా పని పూర్తి చేస్తాడు. హడావుడి పడడు. ఐతే ‘డీజే’.. ‘నా పేరు సూర్య’ చిత్రాలతో ఎదురు దెబ్బలు తిన్నాక బన్నీలో జాగ్రత్త మరీ ఎక్కువైనట్లుంది. ఈసారి తన తర్వాతి సినిమా విషయంలో మరింత సమయం తీసుకుంటున్నాడు. ఒక పట్టాన సినిమా ఓకే చేయట్లేదు.

విక్రమ్ కుమార్ తో సినిమా దాదాపుగా ఓకే అయ్యాక కూడా దాన్ని పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే. ‘అరవింద సమేత’తో సత్తా చాటిన త్రివిక్రమ్ తోనే తన తర్వాతి సినిమా చేయాలని అనుకున్నాడు. ఇద్దరి మధ్య అంగీకారం కుదిరింది కానీ.. కథ మాత్రం ఓకే కాలేదట. ఒకప్పుడు త్రివిక్రమ్ పూర్తి కథ చెప్పకుండానే ‘జులాయి’.. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల్ని బన్నీ ఓకే చేశాడంటారు. కానీ ఇప్పుడు మాత్రం అలా ఆషామాషీగా ఉండట్లేదట. పూర్తి స్క్రిప్టు ఓకే అయ్యాక కానీ సినిమాను అనౌన్స్ చేయొద్దని పట్టుదలతో ఉన్నాడు. తమ కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఒక వెర్షన్ త్రివిక్రమ్ ఆల్రెడీ వినిపించినా.. బన్నీ నుంచి ఆమోదం లభించలేదని.. పక్కాగా స్క్రిప్టు రెడీ అయి.. తనకు పూర్తి సంతృప్తి ఇస్తే తప్ప సినిమా ఓకే చేసే ఉద్దేశం అతడికి లేదని అంటున్నారు. త్రివిక్రమ్ అయినా సరే.. స్క్రిప్టు విషయంలో రాజీ పడొద్దని.. ఏదైనా తేడా వస్తే ఈ సినిమా కూడా ఆపేస్తాడే తప్ప బన్నీ రాజీ మాత్రం పడడని సన్నిహితులు అంటున్నారు.


Tags:    

Similar News