ఇప్పటికైనా ప్రభాస్ ఫ్యాన్స్ మొర ఆలకిస్తారా..?

Update: 2022-06-03 14:30 GMT
'బాహుబలి' తర్వాత యంగ్ రెబల్ స్టార్ నుంచి వచ్చిన 'సాహో' 'రాధే శ్యామ్' సినిమాలు నిరాశ పరచడంతో.. ఈసారి ఎలాగైనా సాలిడ్ సక్సెస్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం డార్లింగ్ నటిస్తున్న సినిమాలలో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చేది "ఆదిపురుష్".

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న 'ఆదిపురుష్' సినిమాని 2023 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంటే రిలీజ్ కు ఆరున్నర నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఇంతవరకూ కనీసం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయకపోవడం పై ప్రభాస్ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

'బాహుబలి' ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్ నటిస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ హిందీ సినిమా "ఆదిపురుష్". ఈ మైథలాజికల్ మూవీ అనౌన్స్ చేసి రెండేళ్లు కావొస్తోంది. అప్పుడెప్పుడో షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

గతేడాది శ్రీరామనవమి కి 'ఆదిపురుష్' ఫస్ట్ లుక్ వస్తుందని ఫ్యాన్స్ అంతా ఆశగా ఎదురు చూశారు. నిరాశే ఎదురైంది. ఆ తర్వాత ప్రభాస్ పుట్టినరోజుకైనా ఫస్ట్ లుక్ వస్తుందని అనుకున్నారు. శుభాకాంక్షలతో సరిపెట్టారు మేకర్స్. ఈ ఏడాది శ్రీరామనవమి పండక్కి పక్కా ఏదొక అప్డేట్ వస్తుందని ఆతృతగా వేచి చేశారు. కానీ ఈసారి ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ని వదిలారు.

ప్రభాస్ ఫస్ట్ లుక్ కోసం ఇలా ఆశగా ఎదురు చూసిన ప్రతీసారి అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. ఏ సందర్భంలోనూ సినిమాకు సంబంధించిన చిన్న విశేషాన్ని కూడా ప్రేక్షకులతో పంచుకోలేదు. ఇంకా సినిమా గురించిన ఏ అప్డేట్ బయటకు రాలేదు అప్పుడే సినిమా టికెట్ల ధరల గురించి చర్చ మొదలు పెట్టారు.

'ఆదిపురుష్' సినిమాను 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నామని.. ఇప్పటిదాకా ఇండియన్ సినిమా చరిత్రలో ఏ సినిమాకూ లేని విధంగా టికెట్ రేట్లు ఉంటాయని నిర్మాత భూషణ్ కుమార్ చెబుతున్నారు. సినిమా కంటెంట్ వదిలి బిజినెస్ గురించి గొప్పలు చెబితే ఓకే కానీ.. ఆరు నెలల ముందుగానే టికెట్ల ధరలు భారీగా ఉండబోతున్నాయని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అసలే ఈ మధ్య ఇష్టానుసారంగా టికెట్ రేట్లు పెడుతున్నారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి టైంలో తమ సినిమాకు అధిక టికెట్ ధరలు ఉంటాయని ప్రకటించడం పై డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 'ఆదిపురుష్' ఫస్ట్ లుక్ లేదా గ్లిమ్స్ ఏదైనా వదిలి ప్రేక్షకులను ఎగ్జైట్ చెయ్యాలి కానీ.. ఇలా టికెట్ రేట్లు గురించి స్టేట్మెంట్స్ ఇవ్వడమేంటని నిర్మాతలను ప్రశ్నిస్తున్నారు.

రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రాఘవ పాత్రలో ప్రభాస్ కనిపించనుండగా.. జానకి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ నటిస్తోంది. ప్రతినాయకుడు లంకేశ్ గా సైఫ్ అలీఖాన్.. లక్ష్మణ్ గా యువ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు.

అత్యున్నత సాంకేతిక విలువలతో ఆడియన్స్ కు సరికొత్త అనుభూతిని అందించడానికి ఈ సినిమా కోసం లేటెస్ట్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వినియోగిస్తారని తెలుస్తోంది. హిందీ - తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ భారీగా ఉంటుంది. ఇవన్నీ ఫ్యాన్స్ ని ఉత్సాహ పరిచే అంశాలే కానీ.. సాధారణ ప్రేక్షకులను ఎగ్జైట్ చేసేవి కాదు. వారికి ఏదైనా కంటెంట్ చూపిస్తేనే బజ్ ఏర్పడుతుంది.

అందులోనూ రామాయణం నేపథ్యంలో ఇప్పటికే అనేక సినిమాలు చూసేశారు. ఇప్పుడు 'ఆదిపురుష్' సినిమాలో కొత్తగా ఏం చూపించబోతున్నారనే ఆసక్తి జనాల్లో కలిగించాలి. కానీ మేకర్స్ ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదు. అందుకే ప్రస్తుతానికైతే హైప్ లేదు. వచ్చే సమ్మర్ లో రిలీజ్ అయ్యే 'సలార్' గురించి మాట్లాడుకుంటున్నారు కానీ.. ఈ సినిమాని లైట్ తీసుకుంటున్నారు.

ప్రభాస్ వంటి స్టార్ హీరోని.. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని చేతిలో పెట్టుకొని పబ్లిసిటీ చేయకపోవడం పై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఫ్యాన్స్ మొర ఆలకించి.. టికెట్ రేట్ల పై స్టేట్మెంట్స్ మానేసి 'ఆదిపురుష్' సినిమాని ప్రమోషన్స్ పై దృష్టి పెడతారేమో చూడాలి.
Tags:    

Similar News