మూవీ రివ్యూ - వీర సింహారెడ్డి

Update: 2023-01-12 09:33 GMT
‘వీరసింహారెడ్డి’ మూవీ రివ్యూ

నటీనటులు: నందమూరి బాలకృష్ణ-శ్రుతి హాసన్-హనీరాజ్-వరలక్ష్మి శరత్ కుమార్-దునియా విజయ్-మురళీ శర్మ-రవిశంకర్-అజయ్ ఘోష్ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: రిషి పంజాబి
మాటలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాతలు: వై.రవిశంకర్-నవీన్ ఎర్నేని
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: గోపీచంద్ మలినేని

సంక్రాంతి సినిమాల్లో తిరుగులేని రికార్డున్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఈసారి మళ్లీ ఆయన పండుగ రేసులోకి వచ్చారు. ‘అఖండ’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన.. ‘క్రాక్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న గోపీచంద్ తో కలిసి చేసిన సినిమా ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

జై (బాలకృష్ణ) ఇస్తాంబుల్లో తన తల్లితో కలిసి ఒక రెస్టారెంట్ నడుపుతూ ఉంటాడు. అతడికిి అక్కడే పరిచయమైన ఈషా (శ్రుతి హాసన్)తో పెళ్లి నిశ్చయం అవుతుంది. అప్పటిదాకా జైకి తన తండ్రి గురించి ఏమీ తెలియదు. ఆయన చనిపోయాడని అనుకుంటుంటాడు. కానీ అప్పుడే తల్లి తండ్రి గురించి చెబుతుంది. రాయలసీమలో జై తండ్రి వీరసింహారెడ్డి ఒక పెద్దమనిషి. ఆ ప్రాంతం మీద కన్ను వేసి.. తనను ఎప్పుడు చంపుదామా అని చూస్తున్న ప్రతాపరెడ్డి (దునియా విజయ్)తో ఎదుర్కొంటూ  అక్కడే ఉన్న వీరసింహారెడ్డి.. కొడుకు పెళ్లి కోసమని ఇస్తాంబుల్ వస్తాడు. అక్కడ కూడా అతడి మీద దాడి జరుగుతుంది. మరి ఆ దాడి నుంచి వీరసింహారెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడా.. ఇంతకీ ప్రతాపరెడ్డితో అతడి వైరం ఏంటి.. భార్యా బిడ్డలకు దూరంగా వీరసింహరెడ్డి సీమలో ఎందుకుంటున్నాడు.. ఈ విషయాలన్నీ తెర మీదే చూడాలి.

కథనం-విశ్లేషణ:

గోపీచంద్ మలినేని బాలయ్యకు పెద్ద ఫ్యాన్. ఒక అభిమాని బాలయ్యను ఎలా చూడాలనుకుంటాడో అలా చూపిస్తా అని ‘వీరసింహారెడ్డి’ మొదలైనపుడు అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. అన్న మాటను నిలబెట్టుకుంటూ.. అభిమానులు మెచ్చేలా బాలయ్యను ప్రెజెంట్ చేశాడు గోపీ. వీరసింహారెడ్డిగా బాలయ్య గెటప్ సూపర్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. హీరో ఎలివేషన్లు మామూలుగా లేవు. యాక్షన్ ఘట్టాలు వారెవా అనిపిస్తాయి. డైలాగులు పేలిపోయాయి. కానీ ఒక సినిమాకు ఎలివేషన్లు.. యాక్షన్ సీన్లు.. డైలాగులు మాత్రమే సరిపోతాయా? ఎంతో కొంత విషయం ఉన్న కథ.. కొంచెం వైవిధ్యం ఉన్న కథనం.. కొన్ని కొత్త సీన్లు ఉండాలి కదా? కానీ గోపీచంద్ ఇవేమీ పట్టించుకోలేదు. రెండు దశాబ్దాల ముందే జనాలకు మొహం మొత్తేసి పక్కన పెట్టేసిన సీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఒక సాధారణ కథను వండుకుని.. ఓవర్ డోస్ సెంటిమెంట్.. యాక్షన్.. ఎలివేషన్లు జోడించి.. మళ్లీ అదే రొటీన్ వంటకాన్ని వడ్డించాడు గోపీచంద్. ఎలివేషన్లుంటే చాలు ఇంకేం అక్కర్లేదు అనుకునే అభిమానులకు ‘వీరసింహారెడ్డి’ రుచిస్తుందేమో కానీ.. అంతకుమించి ఆశించే వాళ్లకు నిరాశ తప్పదు.

రాయలసీమను కంటిచూపుతో శాసిస్తూ అక్కడి జనాలకు అండగా నిలిచే పెద్ద మనిషి పాత్ర బాలయ్యకు ఎంతమాత్రం కొత్త కాదు. ఆయన ఖద్దరు చొక్కా వేసి.. కత్తి పట్టి శత్రువుల మీదికి దండెత్తడం కొత్త కాదు. పవర్ ఫుల్ పౌరుషం డైలాగులు చెప్పడమూ కొత్త కాదు. ‘వీరసింహారెడ్డి’లోనూ మళ్లీ ఇవే చూస్తాం. మామూలుగా సీమ నేపథ్యంలో సినిమా అంటే హీరో ఇక్కడే ఉండి శత్రువుల తలలు నరుకుతాడు. కానీ ‘వీరసింహారెడ్డి’లో బాలయ్య ఫారిన్ కంట్రీలో అడుగు పెట్టి అక్కడ కూడా శత్రువులకు తన కత్తి పదును చూపిస్తాడు. ఈ సినిమాలో కొత్తదనం అని చెప్పుకోవాల్సి వస్తే ఈ విషయమే చెప్పాలి. బోయపాటి సినిమాలు సహా చాలా వాటిలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. ఆ సినిమాలన్నింట్లో కథ.. ఆయన పాత్రలు ఒకే రకంగా ఉంటాయి. ముందుగా ఒక యంగ్ బాలయ్యను చూపిస్తారు. ఆ పాత్ర హీరోయిజం చూపించి.. ఆ తర్వాత ఒక బ్యూటీతో రొమాన్స్ చేయించి.. కొంత కథ ముందుకు నడిచాక సీనియర్ బాలయ్యను రంగంలోకి దించుతారు. ఆ పాత్రకు ఒక రేంజిలో ఎలివేషన్ ఇవ్వడం.. ఇంటర్వెల్ సమయానికి ఒక భారీ యాక్షన్ ఘట్టం పెట్టడం.. అక్కడ కట్ చేస్తే ఈ సీనియర్ బాలయ్య ఫ్లాష్ బ్యాక్ చూపించడం.. ఆ తర్వాత ఒక భారీ క్లైమాక్స్.. ఇదీ బాలయ్య డబుల్ యాక్షన్ సినిమాల ఫార్మాట్. అచ్చంగా ఇదే ఫార్మాట్ ను గోపీచంద్ ఫాలో అయిపోయాడు.

ఐతే బోయపాటి లాగే సీనియర్ బాలయ్యను పవర్ ఫుల్ గా చూపించడంలో గోపీచంద్ విజయవంతం అయ్యాడు. మరీ ఎక్కువ టైం తీసుకోకుండా అరగంటకే ఈ పాత్రను రంగంలోకి దించేసిన గోపీచంద్.. ఎలివేషన్ సీన్లతోనే సినిమాను ముందుకు నడిపించాడు. వీరసింహారెడ్డి పాత్రలో బాలయ్య గెటప్ దగ్గర్నుంచి అన్నీ సూపర్ అనిపిస్తాయి. సాయిమాధవ్ బుర్రా పవర్ ఫుల్ డైలాగులు ఈ పాత్ర ఎలివేషన్ కు కొంత ఉపయోగపడితే.. స్లో మోషన్లో సాగే యాక్షన్ ఘట్టాలు ఇంకొంచెం ఎలివేషన్ ఇచ్చాయి. సీన్లు కొత్తగా అనిపించకపోయినా.. అభిమానులు-మాస్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చేలా వాటిని డిజైన్ చేశాడు గోపీచంద్. ఒకదాని తర్వాత ఒకటి హై ఇచ్చే ఎలివేషన్ సీన్లతోనే ప్రథమార్ధం ముందుకు సాగుతుంది. ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్.. అక్కడొచ్చే ట్విస్టు ఆకట్టుకుంటాయి.

ఆ తర్వాత రెండో అర్ధాన్ని ఫ్లాష్ బ్యాక్ కోసమే అంకితం చేసేశాడు దర్శకుడు.  అప్పటికే వీరసింహారెడ్డి వీరత్వమంతా చూసేయడంతో మళ్లీ జీరో నుంచి ఆ పాత్రను మొదలుపెట్టాక ఏమంత ఆసక్తి కలగదు. బాగా లెంగ్తీగా.. ఓవర్ డ్రామా-సెంటిమెంటుతో సాగే ఫ్లాష్ బ్యాక్ ‘వీరసింహారెడ్డి’ గ్రాఫ్ ను బాగా తగ్గించేస్తుంది. చెల్లెలే హీరో మీద పగతో రగిలిపోవడానికి కారణమేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి తప్పితే.. ఫ్లాష్ బ్యాక్ ఏమంత ఎగ్జైటింగ్ గా అనిపించదు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఫ్లాష్ బ్యాక్ ముగిశాక రొటీన్ క్లైమాక్సుతో ‘వీరసింహారెడ్డి’కి శుభం కార్డు పడుతుంది. మొత్తంగా చూస్తే వీరసింహారెడ్డిగా బాలయ్య పెర్ఫామెన్స్.. కొన్ని ఎలివేషన్లు మినహాయిస్తే సినిమాలో చెప్పుకోదగ్గ విశేషాలేం లేవు. విపరీతమైన హింస వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాతో కనెక్ట్ కావడం కూడా కష్టమే. ఫ్యాన్స్.. మాస్ కు ‘వీరసింహారెడ్డి’ కొంచెం కిక్కు ఇవ్వొచ్చు.

నటీనటులు:

నందమూరి బాలకృష్ణకు పవర్ ఫుల్ పాత్ర పడితే ఎలా చెలరేగిపోతాడో ‘వీరసింహారెడ్డి’తో మరోసారి రుజువైంది. వీరసింహారెడ్డిగా బాలయ్య గెటప్ దగ్గర్నుంచి అన్నీ బాగా కుదిరాయి. ఇలాంటి పాత్రలు బాలయ్యకు సెట్ అయినట్లు ఇంకెవరికీ కావు అనే రేంజిలో ఆ పాత్రలో నందమూరి హీరో అదరగొట్టాడు. ఆ పాత్ర వీరత్వం చూపించే సన్నివేశాలు బాగా పండాయి. ఈ పాత్రకు డైలాగులు కూడా బాగా కుదరడంతో బాగా ఎలివేట్ అయింది. యంగ్ క్యారెక్టర్లో బాలయ్య సాధారణంగా కనిపించాడు. హీరోయిన్లు శ్రుతి హాసన్.. హనీరాజ్ ఉన్నారంటే ఉన్నారు అనిపించారు. వాళ్లకు నటన పరంగా ఏమాత్రం స్కోప్ లేదు. శ్రుతి చాలా గ్లామరస్ గా కనిపించింది. కన్నడ నటుడు దునియా విజయ్ చేసిన విలన్ క్యారెక్టర్ సాధారణంగా అనిపిస్తుంది. అతడి నుంచి ఏదో ఆశిస్తాం కానీ.. మామూలుగా లాగించేశాడు. అతడితో పోలిస్తే వరలక్ష్మి శరత్ కుమార్ కొంచెం బెటర్. ‘క్రాక్’లో జయమ్మ స్థాయిలో లేకపోయినా ఆమె పాత్ర పర్వాలేదనిపిస్తుంది. తన నటన కూడా బాగుంది. వీరసింహారెడ్డి కుడి భుజం పాత్రలో లాల్ బాగా చేశాడు. అజయ్ ఘోష్.. మురళీ శర్మ పర్వాలేదు.

సాంకేతిక వర్గం:

బాలయ్య మీద తన ప్రేమను తమన్ మరోసారి చాటుకున్నాడు. ‘అఖండ’లో మాదిరే ఇందులోనూ యాక్షన్.. ఎలివేషన్ సీన్లను తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో భలేగా ఎలివేట్ చేశాడు. కొన్నిచోట్ల మరీ లౌడ్ గా అనిపించి చెవుల తుప్పు వదలగొట్టేస్తుంది. అయినా సరే.. ఆర్ఆర్ విషయంలో తమన్ ను అభినందించాల్సిందే. అతడి పాటలు సోసోగా అనిపిస్తాయి. కొత్తదనం లేదు. రిషి పంజాబి కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారి నిర్మాణ విలువల విషయంలో వేలెత్తి చూపించడానికి లేదు. సాయిమాధవ్ బుర్రా.. మాటలతో ఆటలాడుకున్నాడు. ‘‘ఇది ముడిపడే చోటు.. తలపడే చోటు కాదు’’ లాంటి పంచులతో పాటు.. జగన్ ప్రభుత్వానికి గట్టిగా తాకే కొన్ని డైలాగులు బాగా పేలాయి. రైటర్ కమ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తన అభిమాన హీరోతో సినిమా తీసే అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేదనే చెప్పాలి. ఎంతసేపూ బాలయ్యను యాక్షన్ సన్నివేశాలు.. డైలాగులతో ఎలా ఎలివేట్ చేయాలని చూశాడే తప్ప.. కథాకథనాల మీద పెద్దగా దృష్టిపెట్టినట్లు కనిపించదు. ఎలివేషన్.. యాక్షన్ సీన్లను బాగా హ్యాండిల్ చేశాడు.. సీనియర్ బాలయ్యను బాగా చూపించాడు తప్ప.. ఇంకే ప్రత్యేకతా చూపించలేకపోయాడు.

చివరగా: వీరసింహారెడ్డి.. ఎలివేషన్లతో సరి

రేటింగ్-2.25/5
Tags:    

Similar News