గౌతమ్ మీనన్.. మళ్లీ ఆపేశాడు

Update: 2017-06-08 07:42 GMT
గౌతమ్ మీనన్ సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకడు. అతడి నుంచి అద్భుతమైన సినిమాలొచ్చాయి. గౌతమ్ తీసిన ఫ్లాప్ సినిమాలు కూడా ప్రేక్షకుల్ని పూర్తిగా నిరాశ పరిచినవి కావు. తన సినిమాల్లో ఏదో ఒక ప్రత్యేకత చూపిస్తాడతను. నిర్మాతగా కూడా గౌతమ్ తన అభిరుచిని చాటుకున్నాడు. కాకపోతే గత కొన్నేళ్లుగా గౌతమ్ మీనన్ సినిమాలతో వస్తున్న సమస్య ఏంటంటే.. అతడి సినిమాలు మధ్య మధ్యలో ఆగిపోతున్నాయి. రిలీజ్ బాగా ఆలస్యం అయిపోతోంది. నితిన్ హీరోగా గౌతమ్ నిర్మించిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ ఎంత లేటైందో తెలిసిందే. ఇక గౌతమ్ స్వీయ దర్శకత్వంలో చేసిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ పరిస్థితి కూడా అలాగే అయింది. 2015 చివర్లో రావాల్సిన సినిమా 2016 ఆఖర్లో వచ్చింది.

‘సాహసం..’ చేస్తున్న సమయంలోనే ధనుష్‌ హీరోగా గౌతమ్ మొదలుపెట్టిన ‘ఎన్నై నొక్కి పాయుం తోటా’ ఈ ఏడాది ఆరంభంలోనే రావాల్సింది. దాని సంగతి అతీ గతీ లేదు. ఇంతలో దాన్ని పక్కన పెట్టి విక్రమ్ హీరోగా ‘ధృవనక్షత్రం’ మొదలుపెట్టాడు గౌతమ్. చకచకా షూటింగ్ చేస్తూ.. వరుస బెట్టి పోస్టర్లు.. ఒకటికి రెండు టీజర్లు రిలీజ్ చేసిన గౌతమ్.. ఈ చిత్రాన్ని ఆగస్టులోనే రిలీజ్ చేస్తానంటూ కౌంట్ డౌన్ కూడా మొదలుపెట్టాడు. కానీ తాజా సమాచారం ప్రకారం గౌతమ్ ఈ సినిమాను కూడా మధ్యలో వదిలేశాడట. అతడికి, విక్రమ్‌ కు ఏవో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి.. ఈ సినిమా షూటింగ్‌ కు బ్రేక్ పడిందని.. ఈ ప్రాజెక్టు ముందుకు కదలకుండా ఆగిపోయిందని.. ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కూడా కనిపించట్లేదని అంటున్నారు. ‘ధృవనక్షత్రం’ ప్రోమోస్ ఆకర్షణీయంగా ఉండటంతో.. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అతడికి ఈ చిత్రం రిలీఫ్ ఇస్తుందని అభిమానులు ఆశించారు. కానీ దీని కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తూ సినిమా ఆగిపోయిందన్న వార్తలొస్తున్నాయి. మరి గౌతమ్ మళ్లీ ఈ సినిమాను ఎప్పుడు మొదలుపెట్టి.. ఎప్పుడు పూర్తి చేస్తాడో.. ఎప్పుడు విడుదలకు సిద్ధం చేస్తాడో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News