యువ హీరో వివాహ వేడుకకి అతిథిగా వచ్చిన మహమ్మారి...!

Update: 2020-08-07 16:00 GMT
కరోనా మహమ్మారి కారణంగా ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్న శుభ‌కార్యాలు వాయిదా వేసుకోవాల్సిన ప‌రిస్థితులు ఏర్పడ్డాయి. ప్ర‌భుత్వాలు కూడా భారీ స‌మూహాలు ఏర్పడే ఫంక్షన్స్ కి అనుమ‌తులు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ అతి త‌క్కువ మంది సన్నిహితులు బంధువుల మ‌ధ్య వివాహం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ లో కూడా పలువురి వివాహాలు జరిగాయి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకొని వివాహ వేడుక నిర్వహించినా ఓ యువ హీరో పెళ్ళికి అనుకోని అతిథిలా కరోనా మహమ్మారి వచ్చిందని టాలీవుడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

కాగా టాలీవుడ్ యంగ్ హీరో అనేక వాయిదాల అనంతరం ఇటీవల పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. ఇరువురి కుటుంబాలు మరియు దగ్గరి బంధుమిత్రులు కొద్దిమంది అతిథుల సమక్షంలో వైభవంగా వివాహం చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకి టాలీవుడ్ నుంచి నటీనటులు ప్రముఖ దర్శకనిర్మాతలు కూడా హాజరై వధువరులను అశీర్వదించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ పెళ్లికి హాజరైన పలువురు ఇప్పుడు కరోనా బారీన పడినట్లు తెలిసింది. దీంతో ఆ యువ హీరో పెళ్ళికి హాజరైన మిగతా వారికి టెన్షన్ మొదలైంది. బయటకి వెల్లడించకపోయినా అందరూ కరోనా సోకిందేమో అన్న అనుమానంతో టెస్టులకు క్యూ కడుతున్నారని సమాచారం.

ఇక వివాహానికి హాజరైన సినీ ప్రముఖులు కూడా కలవరపడుతున్నారట. మన హీరో పెళ్లి కదా అని ఆశీర్వదించడానికి పోతే లేనిపోయి టెన్షన్ పడాల్సి వస్తుందే అని తలలు పట్టుకుంటున్నారట. ఇప్పటికే టాలీవుడ్ లో చాలామంది కరోనా బారిన పడిన నేపథ్యంలో వారికి కూడా వచ్చిందేమో అని వారు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారట.




Tags:    

Similar News