అనుష్కను అనాలా? ఫోటోగ్రాఫర్లను తిట్టాలా?

Update: 2021-06-04 01:30 GMT
సెలబ్రిటీలు పబ్లిక్ ప్రాపర్టీలు ఎంతమాత్రం కాదు. వారికంటూ వ్యక్తిగత జీవితం ఉంటుంది. అన్ని విషయాల్లో కాకున్నా కొన్ని సున్నితమైన విషయాల్లో వారి మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. అయితే.. అదేమీ పట్టని మీడియా.. కొత్తగా వచ్చిపడ్డ సోషల్ మీడియా.. వాటిని ఫాలో అయ్యే ఫాలోవర్లు కొంత సంయమనాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. సెలబ్రిటీలు తాము ఫేమస్ అయినా.. తమ పిల్లల విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తారు.

కొందరు సెలబ్రిటీలు తమ పిల్లల ఫోటోల్ని భారీ మొత్తాలకు అమ్మేయటం చేస్తుంటారు. మరికొందరు సెలబ్రిటీలు చిన్న వయసు నుంచే వారిని అందరి కళ్లల్లో పడేలా ప్లాన్ చేస్తే.. మరికొందరు మాత్రం అందుకు భిన్నంగా వారికంటూ ప్రైవసీ జోన్ ను ఏర్పాటు చేయాలని బలంగా నమ్ముతారు. ఎంత సెలబ్రిటీలకు పుట్టినా.. పుట్టుకతోనే స్టార్ స్టేటస్ మంచిది కాదని భావించే ప్రముఖులకు కొదవ లేదు.

ఇటీవల కాలంలో పెరిగిన మీడియా.. సోషల్ మీడియా పుణ్యమా అని.. అందరిలో క్రేజ్ ఉన్న వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాల్ని బహిర్గతం చేసే దరిద్రపుగొట్టు అలవాటు ఎక్కువైంది. ఇందులో భాగంగా తాజాగా అనుష్క.. విరాట్ కోహ్లీలు కలిసి ఇంగ్లండ్ టూర్ కు వెళ్లారు. ఈ సందర్భంగా బస్సు ఎక్కుతున్న అనుష్క పాపను ఫోటో తీయటానికి తెగ ట్రై చేశారు. దీంతో.. పాపను మరింత దగ్గరగా హత్తుకొని.. ముఖం కనిపించకుండా చేతుల్ని అడ్డు పెట్టుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

దీనిపై కొందరు అనుష్కను సమర్థిస్తే.. మరికొందరు ఘాటు వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోకూడదు. ఇంతకు ముందే విరుష్క్ జంట తమ పాప 'వామిక' విషయంలో ఒక విషయాన్ని స్పష్టం చేశారు. తమ పాపకు అవగాహన వచ్చే వరకు తన ఫోటోల్ని బయటపెట్టమని.. తనకు తానుగా ఆలోచించుకున్న తర్వాత తన నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే.. తమ పాప ముఖాన్ని కనిపించకుండా జాగ్రత్త తీసుకున్నారు.

ఎంత సెలబ్రిటీలు అయినప్పటికీ వారి అభిప్రాయాల్ని.. భావోద్వేగాల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది కదా. అందుకు భిన్నంగా అనుష్క కనిపించినంతనే ఆమె కుమార్తె ఫోటోను తీయాలన్న అత్యుత్సాహాన్ని ప్రదర్శించటం సరి కాదు కదా? నిజానికి అలాంటి ప్రయత్నం చేసే ఫోటో గ్రాఫర్లను తిట్టిపోయాల్సింది పోయి.. అందుకు భిన్నంగా అనుష్కను అనటం ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్న.
Tags:    

Similar News