చిరంజీవి గురించి చంద్ర‌మోహ‌న్ అలా అన్నారేంటీ?

Update: 2022-12-05 17:30 GMT
మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంకృషితో హీరోగా ఎదిగి ఇండ‌స్ట్రీలో మెగాస్టార్ గా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన విష‌యం తెలిసిందే. 44 ఏళ్ల క్రితం 1978లో 'పునాది రాళ్లు' సినిమాతో చిరంజీవి  న‌ట ప్ర‌స్థానం మొద‌లైంది. అయితే రిలీజ్ అయిన తొలి సినిమా మాత్రం 'ప్రాణం ఖ‌రీదు'. ఎలాంటి స‌పోర్ట్ లేకుండా ఓ పోలీస్ కానిస్టేబుల్ త‌న‌యుడిగా సినిమాల‌పై మ‌క్కువ‌తో సినీ ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించారు. మ‌ద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరి న‌ట‌న‌లో మెళ‌కువ‌లు నేర్చుకున్న చిరు ఆ త‌రువాతే ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించారు.

'ఖైదీ' సినిమాతో సుప్రీమ్ హీరో అనిపించుకున్నారు. స్టార్ డ‌మ్ ని సొంతం చేసుకున్నారు. ఆ త‌రువాత త‌న‌దైన మార్కు సినిమాల‌తో ఇంతింతై వ‌టుడింతై అన్న‌చందంగా మెగాస్టార్ గా మారిపోయారు. 150 కి మించి సినిమాలు చేసిన చిరంజీవి త‌న కెరీర్ లో ఎన్నో మ‌ర‌పురాని విజ‌యాల్ని సొంతం చేసుకున్నారు. స్టార్ హీరో అయ్యారు. ప్ర‌త్యేక‌మైన స్టార్ డ‌మ్ ని సొంతం చేసుకున్నారు. ప్ర‌స్తుతం 'వాల్తేరు వీర‌య్య‌' మూవీలో న‌టిస్తున్నారు.

బాబి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ 2023 సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్నారు. ఇదిలా వుంటే ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు చంద్ర‌మోహ‌న్ చిరంజీవి కెరీర్ పై తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఓ యూట్యూబ్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చంద్ర‌మోహ‌న్ చిరంజీవి కెరీర్ పై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అల్లు అర‌వింద్ లేక‌పోతే చిరంజీవి లేడ‌న్నారు. త‌ను ఉన్న‌త స్థాయికి ఎద‌గ‌డంతో అల్లు అర‌వింద్ పాత్ర ఎంతో వుంద‌న్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ 'మా రోజుల్లో చిరంజీవిని మ‌హాభార‌తంలోని అర్జునుడుగా సంబోధించే వాళ్లం. అర్జునుడు ఒక మిష‌న్ కు బ‌య‌లుదేరిన‌ప్పుడు అత‌ను ఎప్పుడూ శ్రీ‌కృష్ణుని వైపు చూసేవాడు. శ్రీ‌కృష్ణుడు లేకుంటే భార‌తాన అర్జునుడు లేడు. అలాగే అర్జునుడు చిరంజీవి, శ్రీ‌కృష్ణుడు అల్లు అర‌వింద్ అని పేర్కొన్నారు. ఓ సినిమా అంగీక‌రించే స‌మ‌యంలో ఏ ప్రొడ‌క్ష‌న్ హౌస్ తో క‌లిసి ప‌ని చేయాలి?.. ఎంత పారితోషికం తీసుకోవాలి, ఎలాంటి పాత్ర‌ల‌ని ఎంచుకోవాలి వంటి స‌ల‌హాలు అల్లు అర‌వింద్ ఇచ్చేవార‌ట‌.  

ఇదే విష‌యాన్ని చంద్ర‌మోహ‌న్ తాజాగా వెల్ల‌డించారు. అల్లు అర‌వింద్ స‌హ‌కారం, స‌ల‌హాల వ‌ల్లే చిరంజీవి స్టార్ గా నిల‌బ‌డ్డార‌ని, ఉన్న‌త స్థాయికి చేరుకున్నార‌ని న‌టుడు చంద్ర‌మోహ‌న్ ప‌రోక్షంగా వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌త కొంత కాలంగా చంద్ర మోహ‌న్ సినిమాల్లో పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. తాజాగా చంద్ర మోహ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్ప‌డు నెట్టింట ఆస‌క్తికర‌ చ‌ర్చ‌కు దారి తీశాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News