RRR రన్ టైమ్ ఎంతంటే..?

Update: 2021-10-25 13:30 GMT
యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ''ఆర్.ఆర్.ఆర్'' (రౌద్రం రణం రుధిరం). దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫైనల్ గా 2022 జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో RRR పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుతున్నారు. ఇప్పటికే తారక్ - చరణ్ తమ పాత్రలకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేశారు. దీపావళి నుంచి సినిమా ప్రమోషన్స్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. ఈలోగా ఫైనల్ కట్ ను లాక్ చేసే ఆలోచన చేస్తున్నారట. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ట్రిపుల్ ఆర్ మూవీ రన్ టైం మొత్తం దాదాపు మూడు గంటలకు పైగా వచ్చిదంట.

అయితే జక్కన్న ఈ సినిమా నిడివిని సుమారు 165 నిమిషాలు (2 గంటల 45 నిమిషాలు) ఉండేలా ట్రిమ్ చేయిస్తున్నారట. ప్రస్తుతం RRR టీమ్ అంతా అదే పనిలో ఉన్నారని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే ఈ సినిమా రన్ టైం ఎక్కువగానే పరిగణించబడుతుంది. రాజమౌళి సినిమా అవుట్ పుట్ విషయంలో ఏమాత్రం రాజీ పడరనే సంగతి తెలిసిందే. ఇప్పుడు 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను కూడా దర్శకధీరుడు విజువల్ వండర్ లా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన 'ఆర్.ఆర్.ఆర్' ప్రచార చిత్రాలు - ఇద్దరు హీరోల స్పెషల్ టీజర్లు - 'దోస్తీ' సాంగ్ విశేష స్పందన తెచ్చుకున్నాయి.. సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా ఫిక్షనల్ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో అల్లూరిగా రామ్ చరణ్ - భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇద్దరి మధ్య స్నేహాన్ని ఇందులో ప్రధానంగా చూపించబోతున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ - హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ - సముద్ర ఖని - శ్రియ శరన్ - రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

'ఆర్ ఆర్ ఆర్' చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ప్రముఖ రచయిత బుర్రా సాయి మాధవ్ సంభాషణలు రాసారు. జక్కన్న ఆస్థాన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. కె కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. సాబు సిరిల్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డి.వి.వి. దానయ్య అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

RRR సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానుంది. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషలతో పాటుగా పలు విదేశీ భాషలు కలిపి ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పది బాషల్లో రిలీజ్ కానుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ లోనూ ట్రిపుల్ ఆర్ మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ - డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్మడు పోయాయి. 'బాహుబలి' తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Tags:    

Similar News