పూణే త‌ర‌హా ఫిలింఇనిస్టిట్యూట్ ఎప్పుడు?

Update: 2019-03-08 09:35 GMT
సినిమావోళ్ల‌ను ఆకులో వ‌క్క‌లా చూసేవాళ్లే ఎక్కువ‌!  ఇత‌ర ఇండ‌స్ట్రీల‌పై ఉండే గురి సినిమా ఇండ‌స్ట్రీపై ఉండ‌దు. ఎన్నిక‌ల వేళ గ్లామ‌ర్ ని అవ‌స‌రానికి వాడుకునేందుకు... లేదా గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీని వాడుకుని రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకునేందుకు మాత్ర‌మే వాళ్లు కావాలి. ప‌ర్య‌వ‌సానంగా వినోద‌రంగం అభివృద్ధి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విష‌యంలో విమ‌ర్శ‌కుల ప్ర‌శ్న‌ల‌కు పాల‌కుల వ‌ద్ద స‌మాధానాలే ఉండ‌వు. విభ‌జ‌న‌కు ముందు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ని పాలించిన ఎంద‌రో పాల‌కుల వ‌ల్ల సినిమా అభివృద్ధి కేవ‌లం కొంద‌రి స్వార్థ‌పూరిత ప్ర‌యోజ‌నాల కోణంలోనే సాగింది అన్న విమ‌ర్శ ఉంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణ విడిపోయాక ప‌రిస్థితి ఏమైనా మారిందా? అంటే `ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే` అన్న చందంగా ఉంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్లు పాలించి.. ప‌దేళ్ల వైపు వెళుతోంది టీ-ప్ర‌భుత్వం. విభజ‌న వేళ సినీప‌రిశ్ర‌మ‌కు చాలా చేస్తామ‌ని హామీలిచ్చారు. సినిమాటోగ్ర‌ఫీ మంత్రి గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ ప‌లు వ‌రాల్ని ప్ర‌క‌టించారు. విభ‌జ‌న త‌ర్వాత  తెరాస తెలంగాణ రాష్ట్ర‌ అధికారం చెప్ప‌టింది. ఆ క్ర‌మంలోనే టాలీవుడ్ ఆంధ్రాకు వెళ్ల‌కుండా ఆపగ‌లిగారు. అందుకోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎంతో బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించి అంద‌రి మెప్పును పొందారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ స‌హ‌కారానికి సినీపెద్ద‌లు వొంగి స‌లాం చేశారు.

అయితే ప్ర‌స్తుత స‌న్నివేశ‌మేంటి?  విభ‌జ‌న‌కు ముందుతో పోలిస్తే విభ‌జ‌న త‌ర్వాత టాలీవుడ్ లో జ‌రిగిన అభివృద్ధి ఎంత‌? అంటే విమ‌ర్శ‌కులు పెద‌వి  విరిచేస్తున్నారు. సింగిల్ విండో ప్ర‌తిపాద‌న ఇప్ప‌టికి అమ‌లైంది. అయితే అది కూడా కేంద్రం నుంచి క్లారిటీ రావ‌డం వ‌ల్ల‌నే సాధ్య‌మైంది. ఇక పూణే త‌ర‌హా ఫిలింఇనిస్టిట్యూట్ ని హైద‌రాబాద్ లో ఏర్పాటు చేస్తామ‌ని, అందుకోసం భూములు కేటాయిస్తామ‌ని.. తెలంగాణ బిడ్డ‌ల‌కు అంకిత‌మ‌ని ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు. హైద‌రాబాద్ ని ఫిలింహ‌బ్ గా తీర్చిదిద్దుతామ‌ని.. గ‌చ్చిబౌళిలో యానిమేష‌న్ హ‌బ్ ఏర్పాటు చేస్తామ‌ని కేటీఆర్- త‌ల‌సాని బృందం హామీలిచ్చారు. అయితే ఇవ‌న్నీ ఉన్న‌తంగా ఉన్నా కానీ.. `ప్ర‌క‌ట‌న‌లు ఘ‌నం.. ప‌నులు శూన్యం!` అన్న చందంగా మిగిలాయ‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రెండో ద‌ఫా తెరాస ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. మ‌రోసారి త‌ల‌సాని సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ, మత్స్యశాఖ మంత్రిగా చార్జ్ తీసుకున్నారు. క‌నీసం ఇక‌నైనా ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ని చేసే ఓ ఫిలింఇనిస్టిట్యూట్ ఏర్పాటున‌కు కృషి చేస్తే బావుంటుంద‌ని సినీవర్గాలు కోరుతున్నాయి. దీనివ‌ల్ల తెలంగాణ క‌ళారంగంలో అనూహ్య‌మైన మార్పు, పురోభివృద్ధి సాధ్య‌మ‌ని అభిల‌షిస్తున్నారు. దీనిని స‌ద్విమ‌ర్శ‌గా తీసుకుని త‌ల‌సాని ఏ చ‌ర్య‌లు చేప‌డ‌తారో వేచి చూడాలి.
Tags:    

Similar News