యూట్యూబ్‌ లో తెలుగు వీడియోలు.. యాక్

Update: 2017-07-24 17:30 GMT
‘కారవాన్లో అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్’ అని వీడియో మీద హెడ్డింగ్ కనిపిస్తుంది. మనం ఏదో ఊహించుకుని ఆ వీడియో మీద క్లిక్ చేస్తాం. తీరా అందులోకి వెళ్తే.. షాట్ గ్యాప్ లో దర్శకుడు డైలాగ్స్ ప్రాక్టీస్ చేసుకుని రమ్మంటే హీరోయిన్ కారవాన్లో పడుకుని నిద్రపోయిందని ఉంటుంది. ఇదీ యూట్యూబ్‌ లో తెలుగు వీడియోల దరిద్రానికి సంబంధించిన ఒక ఉదాహరణ.

ప్రతి ఒక్కడూ ఒక యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసేయడం.. కాపీ రైట్ల గురించి పట్టించుకోకుండా సినిమా వాళ్లకు సంబంధించిన ఏదో ఒక వీడియో పట్టుకురావడం.. లేదా ఏవో ఒక ఫొటోల్ని పెట్టి.. దానికో వ్యాఖ్యానం జోడించి వీడియో రెడీ చేయడం.. ఒక చెత్త హెడ్డింగ్ పెట్టి దాన్ని పోస్ట్ చేయడం.. జనాలు హెడ్డింగ్ చూసి ఏదో ఊహించుకుని వీడియో ఓపెన్ చేయడం.. వెర్రిబాగులోళ్లవడం.. ఇదీ వరస.

ఇలాంటి వీడియోలకే లక్షల్లో వ్యూస్ ఉంటున్నాయి. యూట్యూబ్ యాడ్స్ ద్వారా ఆదాయం కూడా బాగానే వస్తోంది. దీంతో రోజుకొకడు యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేస్తున్నాడు. దరిద్రపు ఆలోచనలతో యూట్యూబ్ ను కంపు కంపు చేసేస్తున్నాడు. పొరబాటున యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు. ఇలాంటి వీడియోలు కుప్పలు కుప్పలు వచ్చిపడతాయి. అవే టాప్ ట్రెండ్స్ లిస్టులో ఉంటాయి.

ఇలాంటివి తెలుగుకే పరిమితమా.. ఇంకెవరూ చేయట్లేదా అనిపించొచ్చు. కానీ మిగతా వాళ్లు కూడా చేస్తున్నారు కానీ.. తెలుగు వాళ్ల స్థాయిలో కాదు. ఈ విషయంలో మనోళ్లు బాగా ముదిరిపోయారు. యూట్యూబ్ వాళ్లకు దీనిపై కంప్లైంట్లు చాలానే వెళ్లినా స్పందన లేదు. ఈ మధ్యే ఇవి మరీ శ్రుతి మించిపోతున్న నేపథ్యంలో త్వరలోనే వీడియోలపై ఈ కస్టమైజ్డ్ తంబ్ నైల్స్ తీసేసే యోచనలో యూట్యూబ్ ఉందంటున్నారు. అది జరిగితే తప్ప వీళ్ల తిక్క కుదరదేమో!

Tags:    

Similar News