ఇంతకాలం అమెరికా వెళ్లిన ఇండియన్ ముస్లింలకు అవమానం జరుగుతుందని అనుకుంటుంటాం. ఇక భారతదేశంలో కులపిచ్చి ఉన్నట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా జాతివివక్ష ఉందనేది తెలిసిన విషయమే. అయితే ఈ విషయాలపై తాజాగా టీం ఇండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ - అతడికి కాబోయే భార్య హజల్ కీచ్ లకు కోపం వచ్చింది. దీనిపై ఇద్దరూ ఫైరవడమే కాకుండా యూవీ బలమైన ట్వీట్ కూడా చేశాడు. ఇంతకూ యువీ దంపతులకు అంతగా కోపం తెప్పించిన విషయం ఏమిటే... యూవీ కాబోయే భార్య హజల్ కీచ్ పై జాతి వివక్ష చూపారట.
తనపై వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ ఫర్ కంపెనీ ఎంప్లాయి జాతివివక్ష చూపించాడని ఆమె విరుచుకుపడ్డారు. వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ ఫర్ ఉద్యోగి అయిన పియూష్ శర్మ తనపై జాతివివక్ష చూపించాడని ఆమె ట్విట్టర్ లో తెలిపారు. తనపేరు హిందూ మతానికి చెందినదిగా లేదనే సాకుతో అతడు డబ్బు ఇచ్చేందుకు నిరాకరించాడని ఆమె చెబుతున్నారు. జైపూర్ లోని వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ సంస్థలో పనిచేస్తున్న పియూష్ శర్మ తన దృష్టిలో అత్యంత జాతివివక్ష కలిగిన వ్యక్తి అని.. తన పేరు హిందూగా లేదనే కారణంతో డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడని, హిందువైన తన తల్లి - ముస్లిం అయిన తన ఫ్రెండ్ ఎదురుగానే తనను అవమానించాడని.. తన పేరు హజల్ అని, హిందువుగానే పుట్టి పెరిగానని ఆమె తెలిపింది. హిందూవా - ముస్లిమా.. అసలు సమస్య అధికాదు.. ఆ సంస్థ వివక్ష చూపిస్తుంది అని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ విషయంపై యూవీ కూడా ఘాటుగానే స్పందించాడు. పియూష్ ప్రవర్తన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, జాతివివక్షను ఎవరూ ఏమాత్రం సహించకూడదని, మనుషులగా మనమంతా ఒక్కటే అని స్పందించిన యువీ.. శర్మపై ఆ కంపెనీ కఠిన చర్యలు తీసుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. కాగా... యువరాజ్ - హజల్ కీచ్ ల ఎంగేజ్ మెంట్ గతేడాది నవంబరులో జరిగిన సంగతి తెలిసిందే.