విశాల్‌కి మద్ధతుగా మాజీ CBFC సభ్యుడు అశోక్ పండిట్
ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ & టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (IFTDA)కి ప్రాతినిధ్యం వహిస్తున్న అశోక్ పండిట్ హీరో విశాల్ కి మద్ధతు పలికారు.
హీరో కం నిర్మాత విశాల్ ఇటీవల తన తమిళ చిత్రం 'మార్క్ ఆంటోని' హిందీ వెర్షన్ సెన్సార్ ను క్లియర్ చేయడానికి CBFC ముంబై కార్యాలయం రూ. 6.5 లక్షలు లంచం డిమాండ్ చేసిందని ఆరోపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ప్రధాని నరేంద్రమోడీ సహాయం అందించాలని కోరారు. తాజా పరిణామం ఏమిటంటే.. మాజీ సిబిఎఫ్‌సి సభ్యుడు అశోక్ పండిట్ విశాల్‌కు మద్దతునివ్వడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ఆరోపణలపై సిబిఐ విచారణకు ఆయన పిలుపునిచ్చారు.
ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ & టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (IFTDA)కి ప్రాతినిధ్యం వహిస్తున్న అశోక్ పండిట్ హీరో విశాల్ కి మద్ధతు పలికారు. "IFTDA తరపున మేము ప్రసూన్ జోషికి లేఖ రాస్తున్నాము. ఈ ఆరోపణలపై CBI విచారణకు డిమాండ్ చేస్తున్నాము. డబ్బును స్వీకరించిన వ్యక్తులు CBFC ఉద్యోగులు కాదు కాబట్టి.. డబ్బు ఎవరికి ఇచ్చారో దర్యాప్తు చేయడం అత్యవసరం" అని ఆయన అన్నారు.
ఆరోపణల పూర్వాపరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 28న విశాల్ X (ట్విట్టర్)లో సెన్సార్ బోర్డ్ తో తన సమస్యను వివరించే వీడియోను షేర్ చేసాడు. ఇందులో ఒక లేఖను కూడా ప్రదర్శించాడు. అది చాలా వేగంగా వైరల్ అయింది. ప్రభుత్వ కార్యాలయాలలో ప్రత్యేకంగా సిబిఎఫ్‌సి ముంబయిలో జరిగిన అవినీతిపై అతడు ఈ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. స్క్రీనింగ్ కోసం రూ.3 లక్షలు, సర్టిఫికెట్ కోసం రూ.3.5 లక్షలు అంటూ రెండు లావాదేవీలు చేయాల్సి వచ్చిందని ఈ పరిస్థితి తన కెరీర్‌లో ఎప్పుడూ ఎదురుకాలేదని విశాల్ వెల్లడించాడు. "ఇలా చేయడం నా కోసం కాదు భవిష్యత్తు నిర్మాతల కోసం" అని అన్నాడు. నేను కష్టపడి సంపాదించిన డబ్బు అవినీతికి పోయింది.. సాక్ష్యాలే లేవు కానీ, నిజం ఎప్పటిలాగే గెలుస్తుందని ఆశిస్తున్నాను"అని వ్యాఖ్యానించాడు. ఇక ఇప్పటికే సమాచార ప్రసారాల శాఖ రంగంలోకి దిగి ఈ ఇష్యూపై విచారణ జరుపుతోందని కూడా సమాచారం అందింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ లో... సెన్సార్ బోర్డ్‌లో అవినీతి జరిగినట్లుగా ఆరోపణలు రావడం బాధాకరమని.. అవినీతి జరిగితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేసింది. ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు రుజువైతే తప్పకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.