రేవంత్ పదివేలు... బాబు ఏడు వేలు...మోడీ ఏమంటారు ?

ఇంతటి పెను విపత్తు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలూ బాగా దెబ్బ తిన్నాయి.

Update: 2024-09-14 04:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. కనీ వినీ ఎరగని తీరులో భారీ వర్షాలు కురియడంతో ప్రజా జీవితం అస్తవ్యస్తం అయింది. అంతే కాదు భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ప్రాణ నష్టం ఎక్కువగానే జరిగింది.

ఇంతటి పెను విపత్తు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలూ బాగా దెబ్బ తిన్నాయి. తెలంగాణా ఏపీ కంటే ఆర్థికంగా కొంత స్తోమత తో ఉన్నా ఆ రాష్ట్రానికీ ఏడు లక్షల కోట్ల దాకా అప్పులు ఉన్నాయి. నిధుల కొరత ఉండనే ఉంది. ఏపీ విషయానికి వస్తే అలాంటి సమస్య ఎదుర్కొంటోంది. పది లక్షల కోట్ల అప్పు ఏపీది దాంతో ఏపీ అన్ని విధాలుగా ఇబ్బందులో ఉంది. దీనికి తోడు అన్నట్లుగా వచ్చిన వరదలు ఇంకా కుంగదీశాయి.

ఏపీ ప్రభుత్వం ప్రాధమికంగా వేసిన అంచనా ప్రకారం చూస్తే ఆరు వేల 800 కోట్ల రూపాయల దాకా నష్టం వాటిల్లింది అని లెక్క తేల్చింది. ఇంకా చాలా నష్టమే జరిగిందని ఇది జస్ట్ ప్రాధమికమే అని పేర్కొంది. తక్షణ సాయం కింద నిధులు విడుదలా చేయాలని కూడా ఏపీకి వచ్చిన కేంద్ర బృందాన్ని చంద్రబాబు కోరారు.

అదే విధంగా జాతీయ విపత్తుగా గుర్తించమని కేంద్రాన్ని కూడా కోరారు. మరో వైపు తెలంగాణాలో కేంద్ర బృందం పర్యటించి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయింది. ఈ సందర్భంగా కేంద్ర బృందానికి రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు

అవన్నీ వివిధ శాఖల నుంచి వచ్చిన అంచనాలు అని ఇంకా పూర్తి వివరాలు వస్తే నష్టం మరింతగా పెరుగుతుందని ఆయన చెప్పరు. అందువల్ల భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గట్టిగానే కోరారు. అంతే కాదు ఏ మాత్రం షరతులు పెట్టకుండా తాము కోరినన్ని నిధులు ఇస్తేనే తెలంగాణాలో వరద నష్టాన్ని కష్టాన్ని అధిగమించగలమని ఆయన కేంద్ర బృందానికీ సూచించారు.

ఖమ్మం పట్టణానికి మున్నేరు వాగుతో ఉన్న వరద ముప్పును నివారించేందుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే శాశ్వత పరిష్కారమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం కేంద్రం నిధులు కేటాయించేలా చూడాలని, రాష్ట్రం తనవంతుగా నిధుల వాటాను భరించేందుకు సిద్ధంగా ఉందని ఆయన వివరించారు.

ఇలా రేవంత్ రెడ్డి వరదల వల్ల నష్టం పూడ్చడం కేంద్రానిదే బాధ్యత అన్నారు. ఎన్డీయేలో కీలకమైన భాగస్వామిగా ఉన్న టీడీపీకి కూడా కేంద్ర సాయం పెద్ద ఎత్తున కావాల్సి ఉంది. అయితే ఏపీ దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలనే కోరింది. రేవంత్ రెడ్డి మాత్రం పది వేల కోట్ల రూపాయలు సాయం అందించాలని కోరుతున్నారు.

ఇలా రెండు రాష్ట్రాలు కోరుతున్న వేళ కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది అన్నదే చర్చగా ఉంది. మరో వైపు వరదలు సంభవించి రెండు వారాలు అయినా కేంద్రం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని వామపక్ష నాయకులు విమర్శించారు. తక్షణ సాయం అన్న మాట కూడా లేదని అంటున్నారు. మరి కేంద్ర బృందం ఇచ్చే నివేదికలను చూసి ఏపీకి ఏడు వేల కోట్లు తెలంగాణాకు పదివేల కోట్లు మోడీ మాస్టారు ఇస్తారా. ఏమో వెయిట్ అండ్ సీ.

Tags:    

Similar News