న్యూజిలాండ్ వెళుతున్న కన్నప్ప
విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'కన్నప్ప'. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు
విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'కన్నప్ప'. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందే కన్నప్ప మొదటి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఒక నాస్తిక యోధుడు శివుని పరమ భక్తుడిగా మారడానికి చేసిన ప్రయాణం ఎలాంటిదో తెరపై చూపిస్తున్నాం! అంటూ మేకర్స్ ఆసక్తిని రేకెత్తించారు. విష్ణు అభిమానులు, నెటిజనులు పోస్టర్‌ను ప్రశంసించారు.
కన్నప్ప చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, మధు, నయనతార, మోహన్ బాబు, జోసితా అనోలా రోడ్రిగ్స్ వంటి ప్రముఖ తారలు నటిస్తున్నారు. తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో సినిమా థియేటర్లలో విడుదల కానుంది. AVA ఎంటర్‌టైన్‌మెంట్ - ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తయింది. వచ్చే వారంలో న్యూజిలాండ్ వెళ్లి కీలక షెడ్యూల్ షూటింగును పూర్తి చేయాలనేది ప్లాన్. దసరా కానుకగా 2024 అక్టోబర్ 10న విడుదల చేయనున్నారని కూడా తెలుస్తోంది. అంటే దసరా (11 అక్టోబర్)కి ఒక రోజు ముందు రిలీజ్ చేయనున్నారు. ఈ సీజన్ లో దసరా సెలవులను ఎన్ క్యాష్ చేయాలనేది ప్లాన్. ఇది భారీ బడ్జెట్ చిత్రం. సెట్స్ నుంచి సమాచారం మేరకు.. సినిమా చాలా బాగా వస్తోందని టాక్. పలు ఇండస్ట్రీలకు చెందిన సూపర్ స్టార్లు ఇందులో కీలక పత్రలో పోషిస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో తెరకెక్కుతున్న సైలెంట్ పాన్ ఇండియా చిత్రంగా కన్నప్ప గురించి చెప్పవచ్చు. ఈ చిత్రానికి మణి శర్మ, స్టీఫెన్ దేవస్సే సంగీతం అందిస్తున్నారు.
కన్నప్పపై గత సినిమాలు:
శివునికి భక్తుడిగా మారిన నాస్తిక వేటగాడు కన్నప్ప జానపద కథకు తెలుగు ప్రజల్లో గొప్ప ప్రాముఖ్యత ఉంది. శివునిపై అపారమైన భక్తి కలిగి ఉన్న కన్నప్ప ఒకానొక సమయంలో తన కన్నును పొడిచి శివునికి నైవేథ్యంగా సమర్పిస్తాడు. ఇందులో భక్తి పరంగా ఎంతో డెప్త్ ఎమోషన్ ఉంటుంది. ఈ కథ గతంలో కన్నడ, తెలుగు ఇండస్ట్రీల్లో కూడా తెరకెక్కింది. దీనికి 1954లో బెదర కన్నప్ప , కాళహస్తి మహత్యం పేరుతో తెరకెక్కించారు. ఈ రెండిటిలో రాజ్‌కుమార్ నటించారు. ఇది హిందీలో శివభక్త (1955)గా తెరకెక్కింది. ఇందులో షాహూ మోదక్ నటించారు. ఇదే కథను తెలుగులో కృష్ణంరాజు ప్రధాన పాత్రలో 'భక్త కన్నప్ప' (1976)గా తెరకెక్కించగా సంచలన విజయం సాధించింది. కృష్ణంరాజుకు గొప్ప పేరును తెచ్చిన చిత్రమిది. ఇది రాజ్‌కుమార్, శివ రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ నటించిన 'శివ మెచ్చిద కన్నప్ప' (1988)గా మళ్లీ కన్నడలో తెరకెక్కడం విశేషం.