డబ్బింగ్ సినిమా ఆశ చూశారా..

టాలీవుడ్లో ఏడాదిగా పాత సినిమాల రీ రిలీజ్ హంగామా చూస్తూనే ఉన్నాం. కొత్త సినిమాలకు మించి అవి క్రేజ్ తెచ్చుకుని భారీ వసూళ్లు తెచ్చుకున్నాయి.

Update: 2023-09-10 05:00 GMT

టాలీవుడ్లో ఏడాదిగా పాత సినిమాల రీ రిలీజ్ హంగామా చూస్తూనే ఉన్నాం. కొత్త సినిమాలకు మించి అవి క్రేజ్ తెచ్చుకుని భారీ వసూళ్లు తెచ్చుకున్నాయి. మామూలుగానే తెలుగు ప్రేక్షకుల సినిమా పిచ్చి మామూలుగా ఉండదు. ఇక రీ రిలీజ్ సినిమాల విషయంలో వారి సినీ వ్యామోహం పీక్స్‌కు వెళ్లిందనే చెప్పాలి. ఎన్నోసార్లు చూసిన సినిమాలను రీ రిలీజ్ చేస్తే.. వాటి కోసం ఎగబడ్డ తీరు.. థియేటర్లలో ఆ సినిమాలను సెలబ్రేట్ చేసిన తీరు చూసి వేరే ఇండస్ట్రీల వాళ్లు షాకైపోయారు. తెలుగు స్టార్ హీరోల సినిమాలను వారి అభిమానులు ఓన్ చేసుకుని ఇలా సెలబ్రేట్ చేయడం కూడా ఓకే కానీ.. పాత తమిళ అనువాద చిత్రాలను కూడా నెత్తిన పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ‘3’ లాంటి డిజాస్టర్ మూవీకి కూడా మంచి వసూళ్లు వచ్చాయి. ఈ మధ్య సూర్య సన్నాఫ్ కృష్ణన్, రఘువరన్ బీటెక్ సినిమాలు కూడా మంచి ఫలితాన్నందుకున్నాయి.

ఈ ట్రెండ్ చూసి వేరే తమిళ అనువాదాలను కూడా రీ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. వచ్చే వీకెండ్లో ‘బిచ్చగాడు’కు షోలు ప్లాన్ చేశారు. వినాయక చవితికి కానుకగా సెప్టెంబరు 15న ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. అప్పట్లో ‘బిచ్చగాడు’ తెలుగులో ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. మహేష్ బాబు సినిమా ‘బ్రహ్మోత్సవం’ను కూడా వెనక్కి నెట్టి ఈ చిత్రం సూపర్ సక్సెస్ అయింది. దీనికి కొనసాగింపుగా ఈ ఏడాదే రిలీజైన ‘బిచ్చగాడు-2’ కూడా బాగా ఆడింది. ఈ నేపథ్యంలో ‘బిచ్చగాడు’ బ్రాండ్‌ను వాడుకోవడానికి చూస్తున్నారు. సెప్టెంబరు 15కు షెడ్యూల్ అయిన మూడు సినిమాల్లో స్కంద, చంద్రముఖి-2 వాయిదా పడగా.. ‘మార్క్ ఆంటోనీ’ పరిస్థితి అయోమయంగా మారింది. దీంతో ఖాళీగా దొరికిన వీకెండ్‌ను వాడుకోవడానికి ‘బిచ్చగాడు’ రెడీ అవుతున్నాడు. మరి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఏమేర ఆదరిస్తారో చూడాలి.

Tags:    

Similar News