ఖాన్ (Vs) ప్రభాస్: కుట్రల్ని కొట్టి పారేసాడు!
సలార్ క్రిస్మస్ బరిలో విడుదలై ఇప్పటికే 500 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే
సలార్ క్రిస్మస్ బరిలో విడుదలై ఇప్పటికే 500 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సుమారు 800 కోట్ల వరకూ ఫుల్ రన్ లో వసూలు చేస్తుందని అంచనాలున్నాయి. రిలీజ్ తర్వాతా చిత్రబృందం ప్రచారం పరంగా ఎక్కడా తగ్గడం లేదు. అయితే సలార్ పై షారూఖ్ అభిమానుల దుష్ప్రచారం విషయంలో హోంబలే బృందాలు సీరియస్ గా ఉన్నాయని, ఖాన్ నుంచి ఒక సెక్షన్ చేసిన ప్రచారాన్ని మర్చిపోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ చాటింగ్ సెషన్ లో ఇలాంటి విషయాలన్నిటిపైనా ఓపెనయ్యారు. సలార్ తో పోటీపడుతూ షారూఖ్- రాజ్‌కుమార్ హిరాణీల డంకీ విడుదలైంది. ఒక రోజు తేడాతో ఈ రెండు భారీ చిత్రాలు రిలీజ్ కావడంతో థియేటర్ల షేరింగ్ సమస్యాత్మకంగా మారింది. దీంతో డంకీ అభిమానులు సలార్ ని తక్కువ చేస్తూ సోషల్ మీడియాల్లో ప్రచారం చేసారు. సలార్ యావరేజ్ అంటూ కూడా ప్రచారమైంది. కానీ అందుకు భిన్నంగా సలార్ వసూళ్ల హవాను సాగించింది.
అయితే షారూఖ్ అభిమానుల దుష్ప్రచారం గురించి నీల్ ఇప్పుడు ఓపెనయ్యారు. నిజానికి సలార్ - డంకీ మధ్య పోటీ లేదని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశాడు. రెండు చిత్రాల అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ పై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అభిమానులు దీనిని 'యుద్ధం'గా చూసినా కానీ చిత్రనిర్మాతలు పోటీ పడటానికి ప్రయత్నించలేదని, అయితే కలిసి జీవించి వినోదాన్ని పంచుకోవాలని నీల్ నొక్కి చెప్పారు. ప్రతికూల యుద్ధాలు అనర్థదాయకం అని కూడా అన్నాడు. ఇది సినిమా వాతావరణానికి ఉత్పాదకమైనది కాదని పేర్కొన్నాడు. తారుమారు చేసిన సలార్ కలెక్షన్ల గురించి ఆన్‌లైన్ పుకార్లపై స్పందించిన నీల్.. క్లాష్ లేకుండా విడుదలైతే ఇలాంటి ఆరోపణలు, ఫ్యాన్ వార్‌లు తలెత్తే అవకాశం లేదని పేర్కొన్నాడు.
అయితే అతడి వ్యాఖ్యల్ని కొందరు రకరకాలుగా అర్థం చేసుకున్నారు. షారూఖ్ ఖాన్ అతడి బృందం సాలార్ పై ప్రతికూలతను సృష్టిస్తున్నట్లు నీల్ సూచించాడని కొందరు ఆరోపించారు. అయితే నీల్ ఎప్పుడూ ఏ స్టార్ లేదా సినిమా గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదు. పెద్ద స్టార్స్‌తో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఢీకొన్నప్పుడు ఇలాంటివి మామూలే అని పేర్కొన్నాడు. అభిమానుల్లో వార్ నెలకొన్నా కానీ..ఇరు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బాగానే వసూలు చేసాయి. సలార్ చిత్రం ఇప్పటికే 550 కోట్లు వసూలు చేయగా, డంకీ 340కోట్లు వసూలు చేసింది.