ఐపీఎల్ టైంలో ముగ్గురు స్టార్స్ రిస్క్
ఇలాంటి సమయంలో సినిమాలను విడుదల చేయడం అనేది రిస్క్ అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.;
ఇండియాలో సినిమా, క్రికెట్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు ఒకే రోజు ఉంటే ఎక్కువ శాతం మంది క్రికెట్‌కి ఓటు వేస్తారు. క్రికెట్ మ్యాచ్ లైవ్‌ను చూడటం కోసం సినిమాను తర్వాత చూద్దాం అనుకునే వారు చాలా మంది ఉంటారు. అందుకే ఐపీఎల్ సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లో సినిమాల విడుదల హడావిడి తక్కువగా ఉంటుంది. కానీ ఈసారి బాలీవుడ్‌లో ఐపీఎల్‌కి పోటీగా ముగ్గురు బాలీవుడ్ స్టార్స్ బాక్సాఫీస్ వద్దకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఇటీవలే మొదలైన ఐపీఎల్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి మ్యాచ్ అద్భుత రెస్పాన్స్‌ను దక్కించుకుంటుంది. ఇలాంటి సమయంలో సినిమాలను విడుదల చేయడం అనేది రిస్క్ అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రంజాన్ సందర్భంగా సల్మాన్ ఖాన్ తన 'సికందర్' సినిమాను విడుదల చేయబోతున్నాడు. మార్చి 30వ తారీకున విడుదల కాబోతున్న సల్మాన్ ఖాన్ సికిందర్ సినిమాకు తమిళ్ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహించాడు. సల్మాన్ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఎంత ప్రయత్నించినా సికందర్‌కి బజ్ క్రియేట్ చేయలేక పోతున్నారు. సినిమా ప్రారంభించినప్పటి నుంచి ఏదో విధంగా వార్తల్లో ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా సికిందర్‌ను హిందీ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇలాంటి సినిమాను ఐపీఎల్ నడుస్తున్న సమయంలో తీసుకు రావడం అనేది కచ్చితంగా పెద్ద రిస్క్ వ్యవహారం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
సికిందర్ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప మినిమం వసూళ్లు నమోదు అయ్యే పరిస్థితి ఉండదు. సికిందర్ సినిమాకు ఏమాత్రం నెగటివ్ టాక్ వచ్చినా ఐపీఎల్ క్రేజ్‌లో కొట్టుకు పోయే ప్రమాదం ఉంది. అందుకే సికిందర్ సినిమాను ఐపీఎల్ సీజన్‌లో తీసుకు రావడం తప్పుడు నిర్ణయం అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ రంజాన్ సీజన్ సల్మాన్ ఖాన్‌కి కలిసి వస్తుందని, గతంలో రంజాన్‌కి వచ్చిన సల్లూభాయ్ సినిమాలు హిట్ అయ్యాయని కొందరు అంటున్నారు. మొత్తానికి సల్మాన్ ఖాన్ ఏకంగా ఐపీఎల్‌తో పోటీ పడబోతున్నాడు. మరి ఫలితం ఎలా ఉంటుంది అనేది చూడాలి. సల్మాన్ మాత్రమే కాకుండా అక్షయ్ కుమార్, సన్నీ డియోల్ సైతం ఐపీఎల్‌ను ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నారు.
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన కేసరి చాప్టర్ 2 సినిమాను ఏప్రిల్ 18న విడుదల చేయబోతున్నారు. సూపర్ హిట్ కేసరి ప్రాంచైజీలో రాబోతున్న ఈ సినిమాకి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. జలియన్ వాలాబాగ్ నేపథ్యంలో రూపొందిన సినిమా అంటూ ప్రచారం చేయడం వల్ల అంచనాలు పెరిగాయి. అయినా కూడా ఐపీఎల్‌తో పోటీ పడి ఈ సినిమా వసూళ్లు సాధించగలదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో అక్షయ్ కుమార్ సినిమాలు పాతిక కోట్లు రాబట్టడానికి కింద మీద పడుతున్నాయి. ఐపీఎల్ సీజన్‌లో ఫలితం తేడా కొడితే కేసరి ఎక్కడ ఉంటాడో ఊహకు సైతం అందడం లేదు. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ సీనియర్ స్టార్ సన్నీడ ఇయోల్ హీరోగా జాట్ సినిమా రూపొందింది.
ఈ సినిమాను ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఆ సినిమాకి సైతం ఐపీఎల్ రిస్క్ ఫ్యాక్టర్ ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ ముగ్గురు ఐపీఎల్‌కి పోటీగా నిలుస్తున్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుంది అనేది చూడాలి. సౌత్ భాషల్లోనూ కొన్ని క్రేజీ సినిమాలు ఐపీఎల్ సీజన్‌లో రానున్నాయి. వాటిపై కూడా ఐపీఎల్ ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే సౌత్ సినిమాల కంటే నార్త్ సినిమాలపై ఎక్కువగా ఐపీఎల్ ప్రభావం ఉంటుందని గతంలో నిరూపితం అయింది. అందుకే ఆ ముగ్గురు స్టార్ హీరోల సినిమాలకు రిస్క్ ఎక్కువ అనే అభిప్రాయంను సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.