త్రివిక్రమ్ Vs సముద్రఖని.. #BRO టైటిల్ సెలక్షన్ వెనక
బ్రో టైటిల్ చాలా సముచితంగా ఉందని వెంటనే యువత లోకి వెళుతుందని అంతా భావించారట.
ఇటీవలి కాలం లో సినిమాల కు టైటిళ్ల ఎంపిక చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్ లో రెండు లేదా మూడు అక్షరాలతో స్మార్ట్ గా ఉండే టైటిల్స్ ని ఎంపిక చేస్తున్నారు మన ఫిలింమేకర్స్. క్యాచీగా ఉండాలి.. కథానుసారం లేదా పాత్రల ను ఎలివేట్ చేసేలా టైటిల్ ఉండాలని భావిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ - సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సుముద్రఖని తెరకెక్కించిన తాజా చిత్రానికి BRO అనే టైటిల్ ని సూచించినది ఎవరు? అంటే కాస్త వివరాల్లోకి వెళ్లాలి.
నిజానికి తమిళ వెర్షన్ కి 'వినోదం సీతాయం' అనే క్లాసీ టైటిల్ ని ఎంపిక చేసుకున్నారు. దీని అర్థం 'వెర్రి మనసు' అని. కానీ అలాంటి సాఫ్ట్ టైటిల్ కాకుండా కాస్త మాసీగా 'బ్రో' అంటూ తెలుగు టైటిల్ ని ఫైనల్ చేసారు. అయితే ఈ ఎంపిక ఎవరిది? ఎందుకని ఇలా మార్చారు? అంటే దానికి సరైన కారణం కూడా తెలిసింది. టైం ప్రధాన ఇతివృత్తంగా రూపొందించిన ఈ చిత్రానికి నిజానికి 'కాల పురుషుడు' అనే టైటిల్ ని అనుకున్నారట.
కాలం చుట్టూ ఇన్సిడెంట్స్ పై సినిమా కాబట్టి ఈ టైటిల్ బావుంటుందని అనుకున్నారు. కానీ ఇది నేటి ట్రెండ్ కి తగ్గట్టుగా లేదు. దీనికంటే పవన్ .. సాయి తేజ్ పాత్రలు ఒకరినొకరు బ్రో అని పిలుచుకుంటారు కాబట్టి దానినే టైటిల్ గా పెట్టేస్తే బావుంటుందని భావించారట.
బ్రో టైటిల్ చాలా సముచితంగా ఉందని వెంటనే యువత లోకి వెళుతుందని అంతా భావించారట. దాంతో త్రివిక్రమ్ సూచన మేరకు ఈ టైటిల్ ని ఫైనల్ చేసారని తెలిసింది. చాలా టైటిల్స్ ని పరిశీలించాక చివరికి బ్రో అనే టైటిల్ ని ఖాయం చేసారు. ఇది మాస్ కి ఎక్కే టైటిల్. యూత్ కి వెంటనే కనెక్టయిపోతుంది.
పైగా ఇందులో ప్రధాన పాత్రధారులను ఎలివేట్ చేసే విధంగా టైటిల్ ఉంటుందని భావించారట. ఒకవేళ కాల పురుషుడు అని టైటిల్ పెడితే ఇది ఏ పురాణాలకు చెందిన సినిమానో అనుకునే ప్రమాదం ఉంది. అందుకే బ్రో అనే టైటిల్ ని సముద్రఖని- త్రివిక్రమ్ బృందాలు ఫైనల్ చేసారని తెలుస్తోంది.