హ్యాట్సాఫ్.. చందు మొండేటి!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి 'నేషనల్ ఫిలిం అవార్డు'ను అందుకున్నారు.

Update: 2024-10-09 14:09 GMT

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి 'నేషనల్ ఫిలిం అవార్డు'ను అందుకున్నారు. ఆయన తెరకెక్కించిన 'కార్తికేయ 2' సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో జరిగిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించారు చందు మొండేటి. ఇది నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమ గర్వంచే క్షణం అని చెప్పాలి. అందుకే ఈ ఘనత సాధించిన దర్శకుడికి సినీ ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.

2014లో 'కార్తికేయ' సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన చందు మొండేటి.. తొలి చిత్రంతోనే మంచి సక్సెస్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత 'ప్రేమమ్' చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో వచ్చిన ''కార్తికేయ 2'' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తద్వారా సరికొత్త 'పాన్ ఇండియా డైరెక్టర్' గా అవతరించాడు.

చందూ మొండేటి విజన్, అతని అసాధారణమైన రైటింగ్ 'కార్తికేయ 2' సినిమా బ్లాక్ బస్టర్ విజయానికి దోహదం చేశాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. కృష్ణతత్వాన్ని, శ్రీకృష్ణుడి గొప్పదనాన్ని తెలియజేస్తూ తీసిన ఈ మిస్టికల్ అడ్వెంచర్ మిస్టరీ థ్రిల్లర్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. లిమిటెడ్ బడ్జెట్ లో అలాంటి అద్భుతమైన సినిమా తీసి సక్సెస్ చేసినందుకు జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు నేషనల్ అవార్డ్ అందుకొని మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు చందు.

నేషనల్ ఫిలిం అవార్డ్స్ ను భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలుగా భావిస్తారు. తమ కెరీర్ లో ఒక్కసారైనా జాతీయ అవార్డు సాధించాలని ప్రతీ దర్శకుడు కోరుకుంటారు. అలాంటి పురస్కారాన్ని చందు మొండేటి తన నాలుగో సినిమాకే అందుకున్నారంటేనే దర్శకుడి ప్రతిభ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. నవతరం దర్శకులలో చందూ ఒక్కడికే ఈ ఘనత సాధ్యమైంది. అతని టాలెంట్ కు రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని సినీ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

చందు మొండేటి ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య హీరోగా "తండేల్" అనే పాన్ ఇండియా మూవీని రూపొందిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో దాదాపు రూ. 80 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 'కార్తికేయ' ఫ్రాంచైజీలో 'కార్తికేయ 3' సినిమాని ప్రకటించారు. దీంతో పాటుగా మరికొన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు సన్నాహాలు చేస్తున్నారీ టాలెంటెడ్ డైరెక్టర్. త్వరలోనే చందూ నుంచి ఓ భారీ మల్టీలాంగ్వేజ్ మూవీకి అనౌన్స్ మెంట్ రాబోతోందని సమాచారం. ఇది హిందీ తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో రూపొందే పాన్ ఇండియా సినిమా. ఇందులో ఓ బిగ్ స్టార్ హీరో నటిస్తారని తెలుస్తోంది. అతి త్వరలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.

Tags:    

Similar News