సేతుపతి `మహారాజా` చూసి ఉగ్గబట్టి ఏడ్చిన చైనీస్
విజయ్ సేతుపతి నటించిన `మహారాజా` భారతీయ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడమే కాకుండా చైనా ప్రేక్షకులతో కంట తడి పెట్టించి.. వారి గుండెల్ని టచ్ చేసింది.
విజయ్ సేతుపతి నటించిన `మహారాజా` భారతీయ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడమే కాకుండా చైనా ప్రేక్షకులతో కంట తడి పెట్టించి.. వారి గుండెల్ని టచ్ చేసింది. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ గత ఏడాది నవంబర్‌లో చైనాలో విడుదలైంది. అప్పటి నుండి అభిమానుల ఆదరణతో విజయవంతంగా థియేటర్ లలో రన్ అవుతోంది.
ఎక్స్‌లో ట్రెండ్ అవుతున్న ఒక వీడియోలో చైనీయులు కంట తడి పెడుతూ కనిపించారు. సినిమా చూస్తున్న సమయంలో తండ్రీకూతుళ్ల బంధం నేపథ్యం చైనీస్ ప్రేక్షకులను కదిలించింది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తండ్రి కూతుళ్ల బంధం ఎంత గొప్పదో ఇది నిరూపించింది. అభిమానులు థియేటర్లలో ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటున్న ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. ``తండ్రీ కూతురు సెంటిమెంట్ సినిమాలు మన దేశం నుంచి వెళ్లి చైనాలో బాగా ఆడతాయి. దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ ఇప్పుడు `మహారాజా`` అంటూ టీమ్ ప్రచారం సాగిస్తోంది. చైనాతో బార్డర్ సమస్య తీరిన తర్వాత ఆ దేశంలో విడుదలైన తొలి భారతీయ చిత్రమిది.
మహారాజా చిత్రంలో విజయ్ సేతుపతితో పాటు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టి నటరాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం భారతదేశంలో జూన్ 14న విడుదలైంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. అయితే థియేటర్లలో రిలీజైనప్పుడు ప్రేక్షకులలో ఒక వర్గం మహారాజాలో హింసను క్రూరంగా చూపించారని విమర్శించారు. ఈ చిత్రంలో సెల్వం పాత్రను పోషించిన అనురాగ్ కశ్యప్ పాత్రపైనా చర్చ సాగింది. మహారాజా, కిల్ చిత్రాల హింసాత్మక సన్నివేశాలపై ఇటీవల ఎక్కువ చర్చ సాగింది. ఇప్పుడు మలయాళ చిత్రం మార్కోలో హింసాత్మక సన్నివేశాల గురించి చర్చ సాగుతోంది.
చెన్నైలోని బార్బర్ మహారాజా (విజయ్ సేతుపతి ) కథ లో ట్విస్టులు టర్నులు ఏమిటన్నదే ఈ సినిమా. అతడు తన షాప్ నుంచి దొంగతనానికి గురైన డస్ట్‌బిన్‌ను తిరిగి పొందడానికి పోలీసు స్టేషన్‌ను సందర్శిస్తాడు. కానీ అతడి ఉద్దేశాలు పూర్తిగా భిన్నమైనవని పోలీసులు వెంటనే గుర్తించాక ఏం జరిగిందన్నది తెరపై చూడాలి. ఇందులో తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ రక్తి కట్టిస్తుంది.