వజ్రోత్సవంలో 'లెజెండరీ అవార్డు' ఘటనపై చిరు పంచ్!
పద్మవిభూషణ్, పద్మభూషణ్ వంటి అవార్డులతో సత్కరించినా ఈ ఏఎన్ఆర్ అవార్డు తనకు ఎంతో విలువైనదని చిరంజీవి పేర్కొన్నారు.
పద్మవిభూషణ్, పద్మభూషణ్ వంటి అవార్డులతో సత్కరించినా ఈ ఏఎన్ఆర్ అవార్డు తనకు ఎంతో విలువైనదని చిరంజీవి పేర్కొన్నారు. నేటి సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన కార్యక్రమంలో లెజెండ్ అమితాబ్ బచ్చన్ చేతులమీదుగా మెగాస్టార్ చిరంజీవి ఏఎన్నార్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఈ పురస్కారం ఎంత విలువైనదో కారణాన్ని చిరు వెల్లడించాడు.
అవార్డు అందుకున్న అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. ఇంట గెలిచి రచ్చ గెలవటం అనే సామెతను గుర్తు చేసుకుంటూ తనకు వచ్చిన పద్మ అవార్డులు అన్ని చోట్లా గెలుపొందాలని, అయితే ఏఎన్ఆర్ అవార్డు తెలుగు చిత్ర పరిశ్రమలో గెలిచినట్లేనని పేర్కొన్నారు. పద్మ పురస్కారాల కంటే ఏఎన్నార్ పురస్కారం తనకు అమితమైన ఆనందాన్నిచ్చిందని చిరు చెప్పకనే చెప్పారు.
అంతేకాదు చిరు ఎమోషనల్ స్పీచ్ లో ఆద్యంతం రక్తి కట్టించే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇందులోనే వజ్రోత్సవం నాటి వివాదాస్పద `లెజెండరీ అవార్డు` ఘటనను గుర్తు చేసిన చిరు అహూతులను ఆశ్చర్యపరిచారు. టాలీవుడ్ వజ్రోత్సవాల సమయంలో `లెజెండరీ అవార్డు`తో సత్కరించడం తనకు సంతోషాన్నిచ్చిందని, అయితే కొందరు సంతోషంగా లేనందున దానిని స్వీకరించడానికి ఇష్టపడలేదని చిరంజీవి అన్నారు. దానిని టైమ్ క్యాప్సూల్‌లో ఉంచుతానని.. అర్హత ఉన్నప్పుడే స్వీకరిస్తానని కూడా వ్యాఖ్యానించారు.
ఈరోజు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఏఎన్నార్ అవార్డును అందుకోవడం, నా స్నేహితుడు నాగార్జున అవార్డు అందుకోవడానికి నన్ను ఆహ్వానించడం ద్వారా నేను ఇప్పుడు ఇంట్లోను గెలిచినట్లు అని చిరు సరదాగా ఛమత్కరించారు. బయటి వ్యక్తులు ప్రశంసించడం కంటే తన ఇంటి (టాలీవుడ్) వ్యక్తులు ప్రశంసించడం లేదా గౌరవించడం చాలా గొప్ప విషయం అనేది చిరు ఉద్ధేశం. అయితే ఈ వ్యాఖ్య సూటిగా తనను వజ్రోత్సవంలో విమర్శించినవారికి, సంతోషించని వారికి తగిలింది.
టాలీవుడ్ వజ్రోత్సవాలు 2007లో జరిగాయి. తెలుగు సినిమా పరిశ్రమ 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా 2007, జనవరి 26, 27, 28 తేదీల్లో మూడు రోజులపాటు వజ్రోత్సవం జరిగింది. ఈ మూడు రోజులు సినీ పరిశ్రమలో పనిచేసే వారందరికీ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెలవు దినాలుగా ప్రకటించింది. నాటి ఉత్సవాల్లో హీరోల నడుమ అంతర్గత ఘర్షణ, బహిరంగ గొడవ గురించి తెలిసినదే.