చిరంజీవిని విస్తుపోయేలా చేసిన 'సింహాద్రి'

భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు.

Update: 2024-08-03 03:52 GMT

భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. ఆయన గురించి ఓటీటీ దిగ్గజం నెట్‌ ఫ్లిక్స్‌ ''మోడ్రన్‌ మాస్టర్స్‌'' అనే పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే. రాఘవ్‌ కన్నా దర్శకత్వం వహించిన ఈ స్పెషల్ డాక్యుమెంటరీ.. శుక్రవారం నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో పెద్దగా ఎవరికీ తెలియని దర్శకధీరుడి వ్యక్తిగత జీవితం, ఆయన సినిమాల తెర వెనుక విషయాలను తెలియజేసే ప్రయత్నం చేశారు. ప్రభాస్‌, జూనియర్ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, దగ్గుబాటి రానా వంటి హీరోలు జక్కన్నతో కలిసి పని చేసిన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా చెర్రీ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

'స్టూడెంట్ నెం.1' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన ఎస్ఎస్ రాజమౌళి.. ఎన్టీఆర్ తోనే తన రెండో చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. అదే 'సింహాద్రి'. అయితే ఈ సినిమా చూసి మెగాస్టార్ చిరంజీవి ఆశ్చర్యపోయారని రామ్‌ చరణ్‌ చెప్పారు. 'మగధీర' చేయడానికి ముందు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'సింహాద్రి' సినిమాని చూసి తన తండ్రి చిరంజీవి విస్తుపోయారని తెలిపారు. ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న దర్శకుడు, రెండో చిత్రానికే అంత పెద్ద సీనియర్ స్టార్ హీరోనే మెప్పించారంటే రాజమౌళి ప్రతిభా పాటవాలు, దర్శకత్వ పటిమ ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు.

నిజానికి రాజమౌళి 'స్టూడెంట్ నెం.1' తర్వాత, కె.రాఘవేంద్ర రావు తనయుడు కోవెలమూడి సూర్య ప్రకాష్‌తో ఓ ఫాంటసీ మూవీ చేయాల్సింది. కానీ అధిక బడ్జెట్ కారణంగా ప్రాజెక్ట్ నిలిపివేయబడింది. సూర్య ప్రకాష్‌ నటించిన 'నీతో' ప్లాప్ అవ్వడంతో మళ్ళీ దాని గురించి ఆలోచించలేదు. 'మూండ్రమ్ పిరై' సినిమా చూస్తున్నప్పుడు తన మదిలో మెదిలిన ఆలోచనతో రచయిత వి.విజయేంద్ర ప్రసాద్ 'సింహాద్రి' కథ రాసుకున్నట్లు ఓ సందర్భంలో చెప్పారు. ముందుగా దీన్ని బి. గోపాల్, బాలకృష్ణ కాంబోలో తీయాలని అనుకున్నారట. అది కుదరకపోవడంతో ఇదే స్టోరీని రాజమౌళి తీసుకొని, వి. దొరస్వామి రాజుకు వినిపించారు. తారక్ హీరోగా సెట్స్ మీదకు తీసుకెళ్లారు.

2003లో వచ్చిన 'సింహాద్రి' చిత్రం బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పటికి చిరంజీవి ఇండస్ట్రీ రికార్డుని కూడా బ్రేక్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి. ఇది ఎన్టీఆర్ స్టార్ డమ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడమే కాదు, రాజమౌళిని స్టార్ డైరెక్టర్ గా మార్చేసింది. అప్పట్లో మెగాస్టార్ కు యంగ్ టైగర్ గట్టి పోటీ ఇస్తున్నట్లుగా సినీ వార పత్రికల్లో వార్తలు వచ్చేవి. ఇక రామ్ చరణ్ ను రాజమౌళి చేతుల మీదుగానే లాంచ్ చేయాలని చిరు భావించినట్లు టాక్ ఉండేది. ఇప్పుడు చెర్రీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే, ఆ టాక్ నిజమేనేనో అనే సందేహాలు కలుగుతాయి. ఏదేమైనా 2009లో జక్కన్న దర్శకత్వంలో మెగా వారసుడి రెండో సినిమాగా 'మగధీర' పట్టాలెక్కింది. ఇది టాలీవుడ్ లో ఎన్నో రికార్డులు తిరగరాసింది.

Tags:    

Similar News