ఊపిరి ఉన్నంతకాలం ఇక సినిమాలే!
ఆ తర్వాత తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించడం జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి అపై కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన వైనం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ఆ తర్వాత తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. అయితే రోజులు గడిచే కొద్ది గాయం పాతబడుతుంది అన్నట్లు చిరంజీవి కాలక్రమంలో జనసేన పార్టీలో చేరతారా? తమ్ముడుకి ప్రతక్ష్యంగా మద్దతు ప్రకటిస్తారా? అని చాలాసార్లు మీడియాలో ప్రచారం సాగింది.
కానీ అది కేవలం ప్రచారంగానే పరిమితమైంది. అటుపై ఆ పార్టీలో చేరుతున్నారని....కేంద్రంలో రాజకీయాలు చేయబోతున్నారని ఇలా రకరకాల కొత్త ప్రచారాలు తెరపైకి వచ్చాయి. కానీ అవన్నీ అవాస్తమని కాలమే నిర్ణ యించింది. ఇటీవలే చిరంజీవి జనసేన పార్టీ కోసం ఐదు కోట్లు విరాళం కూడా ఇచ్చారు. దీంతో ఆయన జనసేన పార్టీ కి మద్దతిస్తున్నారని..ఆపార్టీలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఈనేపథ్యంలో తాజాగా ఓకార్యక్రమంలో చిరంజీవి రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసారు.
తనలాంటి మనస్తత్వం ఉన్న వారు రాజకీయాలకు పనికి రారు అని అన్నారు. `ఎంతో మంచి చేయాలని రాజకీయ పార్టీ స్థాపించాను. కానీ నేటి రాజకీయంలో నాలాంటి వారు అనర్హులు అన్నది వాస్తవం. అందుకే వెంటనే వెనక్కి వచ్చేసాను. తిరిగొచ్చాక అభిమానులు నాపై మునుపటిలా ప్రేమ చూపిస్తారా? లేదా? అనే సందేహం ఉండేది. కానీ ప్రేక్షకాభిమానులు అదే ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. ఇకపై బ్రతికినంత కాలం సినిమాల్లోనే కొనసాగుతాను` అని అన్నారు.
చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ గురించి ఖండించడం కొత్తేం కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసారు. ఓ సినిమా ఈవెంట్లో దర్శకుడు బాబి కూడా చిరంజీవి లాంటి సున్నితమనస్కులు రాజకీయాలు చేయలేరని..వాటిని పవన్ కళ్యాణ్ చూసుకుంటాడని..మీరు మాత్రం అభిమానుల్ని సినిమాలతో అలరించాలని కోరుకున్నారు.