OTT ఫ్యాన్స్‌కి షాకిచ్చే పిలుపు ఇది
కానీ దాంతో పాటు విశృంఖలత అనేది పెచ్చుమీరుతోందనే విమర్శలు ఎలానూ ఉన్నాయి.
ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అన్నది ఎప్పుడూ సవాల్ గానే ఉంది. దీనికి కేంద్ర సమాచార ప్రసార శాఖ ఎప్పటికప్పుడు కొత్త నియమాల్ని ప్రతిపాదించినా కానీ.. ఇప్పటికీ ఓటీటీ కంటెంట్ పరిమితుల్ని దాటిపోయి ఉందని విమర్శలొస్తున్నాయి. ఓటీటీల్లో విభిన్నమైన కంటెంట్ ని క్రియేటివిటీని చూడగలిగే అవకాశం ఉంది. కానీ దాంతో పాటు విశృంఖలత అనేది పెచ్చుమీరుతోందనే విమర్శలు ఎలానూ ఉన్నాయి.
మనదేశంలో కంటెంట్ సాంప్రదాయ విలువలకు విరుద్ధంగా ఉండడం ఇబ్బందికరమైనది. అలాగే టీనేజీ పిల్లల మనసుల్ని కల్మషంతో నింపే కంటెంట్ ఆమోదయోగ్యమైనది కాదు. లైంగిక పరమైన కంటెంట్ కి చిన్నారులు అడిక్ట్ అయితే ముంచుకొచ్చే ప్రమాదాల గురించి వార్తా కథనాలు వస్తూనే ఉన్నాయి. ఓటీటీలకు అలవాటు పడిన యూత్ శృంగారం పరంగా చెడు దారి పడుతున్నారని ఇటీవలి నివేదికలు చెబుతున్నాయి. ముంబై సహా మెట్రో నగరాల్లో తల్లిదండ్రులను భయపెట్టే కొన్ని ఘటనలు దీనికి సాక్షీ భూతంగా నిలుస్తున్నాయి.
ఓటీటీలు, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లను లైంగికంగా అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రసారం చేయరాదని వాటిని నిషేధించాలని ఇప్పుడు.. సేవ్ కల్చర్ సేవ్ భారత్ ఫౌండేషన్ అధినేత పిలుపునిచ్చారు. లైంగికంగా వక్రీకరించిన కంటెంట్‌ను నిషేధించాలని డిజిటల్ ఇండియా బిల్లును తేవాలని వారు కోరారు. విలువలతో కూడిన కంటెంట్ ని అందించేలా ఓటీటీలపై ప్రభుత్వం ఒత్తిడి తేవాలని అన్నారు.
OTT ప్లాట్‌ఫారమ్‌లు పిల్లల అనుచిత ప్రవర్తనకు కారణమవుతున్నాయనేది బహిరంగ వాస్తవం. ప్రస్తుత IT నియమాలు పనికిరానివిగా ఉన్నాయనే ఆవేదన వ్యక్తమవుతోంది. డిజిటల్ ఇండియా బిల్లు ప్రకారం కంటెంట్‌ను నియంత్రించడంలో విఫలమైన కంటెంట్ ప్రొవైడర్లకు జరిమానాలు విధించాలని సేవ్ కల్చర్ ప్రతినిధి సూచించారు. అయితే ఓటీటీలను నిషేధించడం అనేది సమస్యకు పరిష్కారం కాకపోవచ్చు. డిజిటల్ మీడియాను మేనేజ్ చేయడం చాలా కీలకమైనది. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన అవగాహన కల్పించడం కూడా చాలా ముఖ్యం. బలమైన తల్లిదండ్రుల పర్యవేక్షణ, కమ్యూనిటీ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు.. మెరుగైన కంటెంట్ నియంత్రణ వంటి సమగ్ర వ్యూహాలు సాంప్రదాయ భారతావనిని కాపాడగలవని విశ్లేషిస్తున్నారు.