వెంకటేష్ రైటర్ ని పరిచయం చేస్తున్నాడా?
మొదటి భాగం మంచి విజయం సాధించడంతో రెండవ భాగాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ దూకుడుగా పనిచేస్తున్నారు.
విక్టరీ వెంకటేష్ జోరు ఏమాత్రం తగ్గలేదు. 60 ఏళ్లు దాటినా అదే స్పీడ్ లో సినిమాలు చేస్తున్నారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తోన్న ఏకైక సీనియర్ హీరోగా ప్రశంసలందుకుంటున్నారు. ప్రస్తుతం రానా నాయడు-2 వెబ్ సిరీస్ షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మొదటి భాగం మంచి విజయం సాధించడంతో రెండవ భాగాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ దూకుడుగా పనిచేస్తున్నారు.
మరోవైపు వెంకీ అనీల్ రావిపూడితో కూడా మరో సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. `సంక్రాంతి వస్తున్నాం` అంటే 2025 సంక్రాంతిని బెర్త్ ని ముందే కన్పమ్ చేసేసారు. ఈ సినిమా షూటింగ్ కూడా అతి త్వరలోనే మొదలవుతుంది. ప్రస్తుతం అనీల్ ఆ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉన్నాడు. ఇది అనీల్ మార్క్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. వెంకీ లేడీ ఫాలోయింగ్ ని బేస్ చేసుకుని రాసుకున్న కథ.
పక్కా సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గానే ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా పట్టాలెక్కక ముందే వెంకీ మరో ప్రాజెక్ట్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి ఏకంగా రచయితనే దర్శకుడిగా పరిచయం చేసే బాధ్యత తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. `సామజవరగమన` చిత్రానికి రైటర్ గా పనిచేసిన నందు అనే కుర్రాడు వెంకీకి స్టోరీ చెప్పి మెప్పించాడుట. నచ్చడంతో వెంకీ కూడా చేద్దామనే ప్రామిస్ చేసారుట.
అన్ని అనుకున్నట్లు జరిగితే అనీల్ తర్వాత లైన్ లో ఉండేది నందు కావొచ్చు. కొత్త దర్శకులతో వెంకీ సినిమాలు చేయడం రేర్. ఎంతో నమ్మకం ఉంటే తప్ప ముందుకు రారు. ఒక సినిమా చేసిన అనుభవం ఉంటే కన్సిడర్ చేస్తారు. కానీ ట్రెండ్ మారడంతో ఆయనలోనూ మార్పు వచ్చింది. స్టోరీ నచ్చడంతో పాజిటివ్ గా స్పందించినట్లు తెలుస్తోంది.